
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యదునానందలాల్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా మరియు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో ఎప్పుడు తీసిందో తెలియదు కానీ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
మార్చి 25న హర్దోయ్ జిల్లాలోని హర్పాల్పూర్ ప్రాంతంలో నిర్వహించిన ఒక బహిరంగ కార్యక్రమంలో యదునానందలాల్ వర్మ ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన శ్రీరాముడు , ఆయన తల్లి మాతా కౌసల్యపై అత్యంత వివాదాస్పదమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల దర్నాలను, నిరసనలు వ్యక్తం చేశారు.
వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా , మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించినందుకు వర్మపై కేసు నమోదు చేశారు. మార్చి 27న ఆయనను హర్పాల్పూర్లో అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఐపిసి సెక్షన్లు మరియు ఐటీ చట్టం కింద ఆయనపై విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది.





