
భారత్‌లో దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తయ్యిబా ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను అరెస్టు చేసినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. ఢిల్లీ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
షబ్బీర్‌ది జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా. బంగ్లాదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు లష్కరే తరఫున భారత వ్యతిరేక కార్యకలాపాలు నడుపుతున్నాడు. అందుకోసం భారత్‌లో చట్టవిరుద్ధంగా నివసిస్తోన్న బంగ్లా జాతీయులను నియమించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాక్ పేరు బయటకు రాకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ క్రమంలో దిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్ అధికారులు 2007లో లోన్‌ను అరెస్టు చేశారు.
అప్పుడు అతడి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 26/11 మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలున్నాయని గుర్తించారు. 2018 వరకు తిహాడ్ జైల్లో ఉన్న అతడికి బెయిల్ లభించడంతో బయటకు వచ్చాడు. తర్వాత మళ్లీ బంగ్లాకు వెళ్లిపోయాడు. మళ్లీ తన లష్కరే నెట్‌వర్క్‌ను పునర్నిర్మించాడు. అతడి కార్యకలాపాలపై నిఘా ఉంచిన అధికారులు తాజాగా అరెస్టు చేశారు.





