
( ఏప్రిల్ 27 – శ్రీరామనవమి )
మన సనాతన సంప్రదాయం జీవ చైతన్యాన్ని, ఉనికిని, గమ్యాన్ని నిర్దేశించే నాలుగు ప్రధాన లక్ష్యాల్ని చెప్పింది. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ పురుషార్థాలు వ్యక్తిగత సౌఖ్యానికే గాక సామాజిక స్థిరత్వానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి పునాదులుగా నిలుస్తాయి. వీటిని పాటించినవారు ఉత్తములు. మానవ పరిమితులకు లోబడి ఉంటూనే అత్యున్నత విలువల్ని పాటించి తనను తాను దైవంగా మలచుకున్నాడు శ్రీరామచంద్రుడు.
శ్రీరామచంద్రుని అస్తిత్వానికి మూలాధారం ధర్మం. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నాడు వాల్మీకి మహర్షి. అమూర్తమైన ధర్మం ఒక రూపాన్ని పొందితే.. అది శ్రీరాముడు. ధర్మం అంటే కేవలం కొన్ని ఆచార వ్యవహారాలు కాదు. వ్యష్టిని, సమష్టిని సమన్వయం చేస్తూ విశ్వక్రమాన్ని కాపాడే నైతిక శక్తి. ఈ క్రమంలో సంఘర్షణ ఏర్పడిన ప్రతిసారీ వ్యక్తిగత ప్రయోజనం కంటే సమష్టి ప్రయోజనానికే ప్రాధాన్యత ఇచ్చి తన గమనాన్ని దైవత్వం వైపు నడిపించాడు శ్రీరాముడు.
మాట తప్పడు..
పెద్దలపట్ల గౌరవాన్ని, సత్యం పట్ల నిబద్ధతను పాటిస్తూ కైక మాటల్ని తండ్రి ఆదేశంగా భావించాడు శ్రీరాముడు. సింహాసనాన్ని అధిష్టించడానికి బదులు 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని అంగీకరించాడు. పుత్రధర్మాన్ని కాపాడుకోవడమే గాక తండ్రిని అసత్య దోషం నుంచి కాపాడాడు. తన సౌఖ్యం కంటే ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి.. ప్రాణ సమానురాలైన సీతను పరిత్యజించి రాజధర్మాన్ని నిలబెట్టాడు. సమాజంలో ధర్మాన్ని కాపాడి, శాంతిని నెలకొల్పడానికి- తాటక నుంచి రావణుని వరకూ లోకకంటకులను సంహరించి వీరధర్మాన్ని రక్షించాడు. శత్రు శిబిరం నుంచి వచ్చిన విభీషణుడికి ఆశ్రయమిచ్చి శరణాగత ధర్మాన్ని పాటించిన ధర్మస్వరూపుడాయన. దశరథుని మరణానంతరం భరతుడు అరణ్యానికి వచ్చి- అయోధ్య రాజ్య సింహాసనాన్ని స్వీకరించమని వేడుకున్నప్పుడు కూడా ‘రామో ద్విర్నాభిభాషతే’ అంటూ తండ్రి ఉన్నా, లేకపోయినా తండ్రికి ఇచ్చిన మాటను తప్పనని చెప్పటం రామచంద్రుని ధర్మ నిరతికి, సత్యనిష్ఠకు పరాకాష్ఠ.
ఆర్థికవేత్త..
భారతీయ సంప్రదాయంలో అర్థం అంటే కేవలం ధన సంపాదన మాత్రమే కాదు, క్రమశిక్షణతో కూడిన వనరుల నిర్వహణ. అయోధ్య కాండలోని 100వ సర్గలో రామచంద్రుని అర్థ నిర్వహణ సామర్థ్యం కనిపిస్తుంది. అరణ్యవాసంలో భరతునికి చేసిన ఉపదేశంలో రాజ్య అభివృద్ధికి తోడ్పడే ఉత్తమమైన ఆర్థిక సూత్రాల్ని గమనిస్తే.. రాముని పరిపాలనా సామర్థ్యం, ఆర్థిక వనరుల నిర్వహణ అర్థమవుతాయి. ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండాలనే వ్యయ నియంత్రణ పద్ధతి, వ్యవసాయం, పశుపోషణ, ఉద్యోగుల సంక్షేమం, సకాలంలో వేతనాలు చెల్లించడం, వాణిజ్యంపై శ్రద్ధ, రాజ్యసంపదను ప్రజా సంక్షేమం కోసం వినియోగించటం వంటి ఆర్థిక సూత్రాలెన్నో భరతుడికి రాముడు ఉపదేశించాడు.
ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకపోవడం; చోరులు, నేరస్థులు లేకపోవడమే నిజమైన రాజ్యాభివృద్ధి- అని రామరాజ్యం నిరూపించింది. ధర్మబద్ధమైన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో గడిపారు. అర్థం ఎప్పుడూ ధర్మానికి లోబడి ఉండాలని రాముడు భావించాడు. ధర్మ విరుద్ధమైన సంపద వినాశనానికి దారితీస్తుందని రావణాసురుని సంపద నిరూపించింది.
పురుషార్థం
కామం అనే పదం సాధారణంగా శారీరక సుఖమనే అర్థంలో కనిపిస్తుంది. కానీ జీవితం పట్ల ప్రేమ, సౌందర్యారాధనలకు ప్రతీక కామ పురుషార్థం. కామాన్ని ఎలా ధర్మబద్ధంగా అనుభవించాలో రాముడి ఆదర్శ జీవితం మనకు నేర్పిస్తుంది. రాజులకు అనేకమంది భార్యలు ఉండటం సాధారణమే. కానీ సీతాదేవికే అంకితమై ఏకపత్నీవ్రతాన్ని పాటించాడు రాముడు. కామాన్ని ఒకే వ్యక్తిపై స్థిరీకరించి దాన్ని పవిత్రం చేయడం ద్వారా కుటుంబ వ్యవస్థను బలోపేతం చేశాడు. ధర్మబద్ధమైన కామం రామునిది. ఎందరో సుందరులైన స్త్రీలు తనను ప్రలోభపెట్టినప్పటికీ కామాన్ని ధర్మమనే హద్దును దాటనివ్వలేదు. ధర్మకామాల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు రాముడు తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి బాధాకరమైనప్పటికీ లోక కల్యాణాన్ని ఉద్దేశించినవి.
రావణ వధ అనంతరం ప్రాణానికి ప్రాణమైన సీతను పవిత్రత నిరూపించుకోమని అడగటం బాధాకరమే. కానీ ప్రజలకు ధర్మమార్గాన్ని నిర్దేశించే ఒక రాజుగా అది అవసరం. అనుమానం అనే కంటి జబ్బుతో బాధ పడుతున్న వాళ్లు దీపకాంతి ఉన్నప్పటికీ సరిగా చూడలేరు. నువ్వు స్వచ్ఛంగా, పవిత్రంగా ఉన్నప్పటికీ దృష్టిదోషం ఉన్నవారు సరిగా చూడలేరు. కాబట్టి లోకం కోసం పవిత్రతను నిరూపించుకోమని సీతను కోరాడు. అగ్నిపరీక్ష తర్వాత కూడా సీతను అడవులకు పంపడం ద్వారా రాముడు ధర్మానికి ఇచ్చిన ప్రాముఖ్యత తెలుస్తుంది. సీత కోసం తానెంతగా విలపించినప్పటికీ బాధ్యత కలిగిన రాజుగా తన కామాన్ని ధర్మానికి లోబరిచాడు శ్రీరామచంద్రుడు. ధర్మానికి లోబడని కామం పతనానికి దారితీస్తుందని రావణుడు నిరూపించాడు.
మోక్షప్రదాత..
బాల్యంలోనే అభ్యసించిన యోగవాశిష్ఠ్యం రాముడికి మోక్షసాధనలో మార్గాన్ని చూపింది. యువకుడిగా ఉన్నప్పుడే రాజ్యాన్ని త్యాగంచేశాడు. అది ఐహిక భోగాల పట్ల రాముడి అవగాహనకు ఉదాహరణ. రాజ్యపాలన చేస్తూనే దానికి అంటకుండా సాక్షీభూతంగా ఉండటం ఆయన నిష్కామ కర్మకు నిదర్శనం. కర్తవ్యానంతరం సరయూనదిలో ప్రవేశించటం తనను తాను పరమాత్మలో లీనం చేసుకోవడమే. తాను ముక్తి పొందడమే కాకుండా నిష్క్రమణ సమయంలో తనను అనుసరించిన ప్రతి ప్రాణికి ముక్తిని ప్రసాదించాడు.
రామచంద్రుని జీవితం పురుషార్థాల అద్భుత ఆవిష్కరణ. ఈ పురుషార్థాలు దేనికవి విడివిడిగా కాక పరస్పర సమన్వితమై ఉంటాయి. ధర్మం లేని అర్థం అనైతికం. ధర్మం లేని కామం వినాశకరం. అర్థ కామాలు లేని మోక్షసాధన అసాధ్యం. వీటన్నింటినీ సమన్వయం చేసిన పరిపాలనే రామరాజ్యం. ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం, సంపదను సమాజ శ్రేయస్సుకే వినియోగించడం, ప్రేమను పవిత్రంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తూనే మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం- ఇలా శ్రీరాముడి జీవితం ప్రబోధాత్మకం. పురుషార్థ సమతౌల్యతకు ఆ ఆదర్శమూర్తే దిక్సూచి.





