ArticlesNews

యుగయుగాల ఆదర్శమూర్తి

52views

శ్రీమద్రామాయణ నాయకుడు శ్రీరాముడు ఆదర్శపురుషుడు. ఆ కావ్యం మహోత్కృష్టమైన వ్యక్తిత్వవికాస గ్రంథమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మానవ సంబంధాలు మసకబారుతూ, ఆర్థిక సంబంధాల ముందు ‘హార్దిక’ సంబంధాలు వెలవెలబోతూ`సమాజం, రాజకీయాలు, ఏలికల తీరు గతి తప్పుతున్న వేళ ఆ మహాకావ్యంలోని మానవీయ విలువలను స్మరించుకోవడం విధాయకం. రాముడు దేవుడా? మానవుడా? రామాయణం జరిగిందా? లేదా? అనే ప్రశ్నలు హిందువుల  విశ్వాసాల ముందు తీసికట్టే! ఆ కావ్యం పేర్కొంటున్న ప్రజారంజకపాలన లక్షణాలు, విలువలు వర్తమానంలో అగుపిస్తున్నాయా? అని ప్రశ్నించుకోవలసిన సందర్భం. ఏటేటా వచ్చే శ్రీరామ నవమి పర్వదినం ఆ పురాణపురుషుడి మహిమాన్విత జీవితాన్ని జ్ఞప్తికి తెస్తూ కర్తవ్యోన్ముఖులుగా చేస్తోంది.

శ్రీరాముడికి లోకం దైవత్వం ఆపాదించినా, ఆయన ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు మానవుడిగానే మనుగడ సాగించాడు. మానవాతీతశక్తులను, మహిమలను, మాయలను ప్రదర్శించలేదు. ఉత్తమ పురుషుడిగా వినుతికెక్కాడు. వివేకం, సత్యం, ధర్మం, ఓర్పు, కృతజ్ఞతాభావం తదితర సద్గుణాలకు నిలువెత్తు నిదర్శనం. ఆదర్శ పుత్రుడిగా, సోదరుడిగా, పతిగా, పితగా, మిత్రుడిగా, ఏలికగా…. నూతనాధ్యయం ఆరంభించి, సమత, మమతలకు జీవం పోశాడు. అఖండ భరతావనికే కాదు సర్వసృష్టికి నిత్య ఆరాధ్యనీయుడు, ఆదర్శపురుషుడు. త్యాగ, ధర్మాలను బోధించి, ఆచరించి నిరూపించిన మానవోత్తముడు. తండ్రి మాటను జవదాటడు. విశ్వామిత్రుని ఆదేశం శిరోధార్యమని తండ్రి దశరథుని ఆజ్ఞ. అందుకే తాటక స్త్రీ అయినా ఆమెను సంహరించడంలో గురువు ఆదేశాన్ని అమలు చేశాడు. పితవాక్యపరిపాలన నేటి యువత గ్రహించవలసిన అంశం. పొందిన మేలు మరువడు. పరోపకారం జ్ఞప్తిలో ఉండదు. అప్రియం పలకడు. శøరణాగత రక్షణలో, ప్రజాభీష్ట పరిపాలనలతో తనకు తానే సాటి. అదే సమయంలో దండనార్హులకు శిక్ష తప్పదు. ఆత్మస్తుతి, పరనిందను సహించడు. స్తోత్రపాఠాలు చేసేవారి, చాడీలు చెప్పేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, దుర్భాషలకు, వ్యర్థప్రలాపాలకు దూరంగా ఉండాలని హితవు పలికాడు. మారుతున్న కాలంలో ఈ లక్షణాలన్నీ తారుమారుకావడం కళ్లముందు కదలాడుతున్నవే.

రామాయణం సార్వకాలీన సత్యం. ప్రత్యేకించి నేటి హింసాత్మక ప్రపంచానికి/అనుచిత వైఖరికి విరుగుడు ఈ రసాత్మక కావ్యం. పాలకులు, పాలితులు అనుసరించవలసిన ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయి. రామావతారం మానవత్వానికి, మానవ జీవితానికి అత్యంత సన్నిహితమైనది. రాజరికంలో రాజ్యాధికారం అర్హుడైన జ్యేష్ఠ కుమారుడికి వారసత్వంగా సంక్రమిస్తుంది. కానీ కుమారుడికి పట్టం కట్టేందుకు ఒక చక్రవర్తి ప్రజాభిప్రాయం కోరిన సంఘటన ఈ మహాకావ్యంలో తప్ప ఏ పురాణంలో కనిపించక పోవచ్చు. దశరథ తనయుల త్యాగనిరతికి భిన్నంగా ‘అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ…’ అని ఒక కవి దశాబ్దాల క్రితం రాసిన గేయ వాక్యాలు వర్తమానంలో తారసిల్లుతున్నాయి. తల్లి కైకేయి వరంతో సంక్రమించిన రాజ్యాధికారాన్ని తిరిగి అప్పగించయత్నించిన తమ్ముడు భరతుడికి నచ్చజెప్పి పాలక, పాలితులు సంబంధాలను గుర్తు చేశాడు శ్రీరాముడు. పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చిన ఆయన, పాలనారథం సజావుగా సాగేందుకు అమాత్యులకు, అధికారులకు స్వేచ్ఛనిచ్చాడట. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజా బాహుళ్యంతో సంప్రదించేవాడట. పాలకుల చిన్నపాటి పొరపాటునైనా ప్రశ్నించే అవకాశం పాలితులకు ఉండేదట. రాచరిక వ్యవస్థలోనే అంత వెసులుబాటు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ‘ప్రశ్నించే’ ఆ హక్కు ఎంత పరిఢవిల్లాలో ఆలోచించాలి. ‘ఆదాయ వ్యయాల మధ్యసమతూకం పాటించాలి. అపాత్రదానాలు కూడదు’ అన్న నాటి హితవు, నేటి ‘ఉచితాల’ వల్ల ఎదురయ్యే ఇక్కట్లను గుర్తుచేస్తోంది. ఆధునికయుగంలో ప్రజాకర్షక పథకాల వల్ల ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులకు ఆనాడే ఇలాంటి హెచ్చరిక చేశారని ప్రవచన కర్తలు, ఆధ్యాత్మిక, ఆర్థికవేత్తలు అన్వయిస్తారు. సంక్షేమం, ప్రగతి జంటగా సాగాలన్న నేటి సంకల్పానికి బీజం నాడే పడింది. ప్రజాహితంతో పాటు పాలన సక్రమంగా సాగాలని, పన్నుల భారం లేనప్పుడు కోశాగారం కళకళలాడుతుందన్నది నాటి రాజనీతిజ్ఞత. అధిక పన్నులు ప్రజలకు ఆర్థిక భారమే కాక వాటి ఎగవేతకు మార్గాలు వెదకే ఆస్కారం లేకపోదు. ‘ప్రజలపై అనవసర పన్నుల భారం మోపడంలేదు కదా?’ అని భరతుడిని ఆ కోణంలో ప్రశ్నించాడు.

రామమూర్తికి మాతృగడ్డపై అమిత భక్తి భావం. రావణ వధానంతరం లంకా సౌందర్యానికి సమ్మోహితుడై, మరికొంత కాలం అక్కడే ఉండకోరిన తమ్ముడు సౌమిత్రితో ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని నిత్య నూతనంగా భాసించే సత్యాన్ని ప్రవచించాడు. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి, పుట్టినగడ్డనే చులకన చేసేవారికి ఈ ఉపదేశం కనువిప్పు కలిగించాలి. రామరాజ్యం అంటే శాంతి, సంతోషాల సంగమం. యుగాలు గడిచినా ఆ మాట స్థిరపడిపోయింది. ‘ఆ రాజ్యం తెస్తాం… ఈ రాజ్యం తెస్తాం’ అని ఆయా నేతల పేర్లతో ప్రకటించే వారు రామరాజ్య ప్రస్తావన తే(లే)కపోవడం విచితం. త్రనను కన్నవారిని, తను కన్నవారిని, కట్టుకున్న దానిని నిర్లక్ష్యం చేసేవారికి, నమ్మకద్రోహులకు, పాలితులకు ఇచ్చిన మాటను తప్పేవారికి రామరాజ్య ఉన్నతి అవగాహనకు రాదు. సామాజిక బాధ్యతగా వ్యక్తిగత సుఖాలను పరిత్యజించిన ‘మనీషత్వం’ అంత సులువుగా బోధపడదు. ఈ ఇతిహాసంలో వర్ణితమైన సత్యానురాగం, భ్రాతత్వ భావన, పతిభక్తి, సేవకులపై ఆదరాభిమానాలు, సామాజిక దృక్పథం వంటివి ఆచరణకు వస్తే రామరాజ్యం పునరావృతం కాకపోదు!