
యువతలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించటం, వారిని జిహాద్ కోసం సన్నద్ధం చేయటమే లక్ష్యంగా విజయవాడకు చెందిన యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్‌లు కలిసి ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరిట ఓ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) తేల్చింది. వీరు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్), ఐసిస్‌తో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. విదేశాల్లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ‘భారత్‌పై యుద్ధం’ (గజ్వా-ఏ-హింద్) కోసం వీరు పనిచేస్తున్నట్లు నిర్ధారించింది. దేశవ్యాప్తంగానూ పలు రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్ విస్తరించినట్లు తేల్చింది. వీరు ముగ్గురూ ఉగ్రవాద శిక్షణ పొందడానికి నెల రోజుల్లోగా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు గుర్తించింది. విజయవాడలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరి ముగ్గుర్నీ సోమవారం అదుపులోకి తీసుకుంది. సీఐ సెల్ దర్యాప్తులో గుర్తించిన అంశాలివి.
విద్వేషపూరిత ప్రసంగాలు చూసి..
విజయవాడలో ఓలా, ర్యాపిడో బైక్ డ్రైవర్‌గా పనిచేసుకునే మహమ్మద్ రహమతుల్లా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నాయకుల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు చూస్తూ ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉగ్రవాద సంస్థల సామాజిక మాధ్యమ ఖాతాల్ని అనుసరించటంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల వీడియోలు పోస్టు చేసేవాడు. లేజర్ మార్కింగ్ పని చేసే భవానీపురానికి చెందిన మహ్మద్ దానిష్, బిర్యానీ పాయింట్‌లో పనిచేసే మహంతిపురానికి చెందిన మీర్జా సొహైల్ బేగ్‌లతో కలిసి జిహాద్ కార్యకలాపాలను విస్తృతం చేశాడు. విదేశీ హ్యాండ్లరైన అల్-హకీం షుకూర్‌తో రహమతుల్లా సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అతని ఆదేశాలతో ఏక్యూఐఎస్‌తో సంబంధాలున్న బిహార్‌కు చెందిన షాద్‌మన్ దిల్కుష్, హైదరాబాద్‌కు చెందిన సైదా బేగంతో చేతులు కలిపాడు. తర్వాత ఐసిస్‌తో సంబంధాలున్న ‘బెన్‌ఎక్స్ కామ్’ గ్రూపునకు చెందిన అజ్మానుల్లా ఖాన్ (బిహార్), లక్కీ అహ్మద్ (దిల్లీ), మీర్ ఆసిఫ్ అలీ (పశ్చిమబెంగాల్), జీషాన్ (రాజస్థాన్), అబ్దుల్ సలామ్ (కర్ణాటక), షారుక్‌ఖాన్, షియాక్ ఫియాజ్ ఉర్ రెహ్మాన్ (మహారాష్ట్ర) సహా పలువురితో సంబంధాలు పెట్టుకున్నాడు. వారి ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేవారు.
పాక్, అఫ్గానిస్థాన్‌ల్లో మిలిటెంట్ శిక్షణ కోసం
రహమతుల్లా, సొహైల్ బేగ్, దానిష్‌లు ముఖాలకు మాస్కులు వేసుకుని ముజాహిదీన్లుగా ప్రకటించుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారు. ఒసామా బిన్ లాడెన్ వీడియోలు చూస్తూ అతనిలాగే వేషధారణ, హావభావాలు సాధన చేస్తున్నట్లు గుర్తించారు. జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టటం, జాతీయ గీతాన్ని హేళన చేయటం, జాతీయ జెండా దహనం చేయటం, ఐసిస్‌ను పొగడటం, ఇస్లాంను విశ్వసించని వారిపై విషం చిమ్మటం చేసేవారు. భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనేది తమ లక్ష్యమని ప్రకటించుకునేవారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించేవారు. వారిని పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లకు పంపించి మిలిటెంట్ శిక్షణ తీసుకునేలా ప్రేరేపించేవారు.
ఉగ్రవాద భావజాలం వ్యాపింపజేస్తున్నారు
తీవ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తున్న విజయవాడకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు విజయవాడ ఇన్‌ఛార్జి సీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. మంగళవారం రాత్రి విలేకర్లతో మాట్లాడారు. ‘సామాజిక మాధ్యమాల్లో ఐసిస్, అల్‌ఖైదా పేర్లతో రెండు గ్రూపులు ఏర్పాటు చేసినట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నిఘా పెట్టి.. రహంతుల్లా షరీఫ్ (ఏ1), మహ్మద్ డానిష్ (ఏ2), మీర్జా సొహైల్ (ఏ3)ను అదుపులోకి తీసుకున్నాం. తెలంగాణ, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉన్న మిగిలినవారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఒక గ్రూప్‌లో ఐదుగురు, మరో గ్రూప్‌లో ఏడుగురు చొప్పున ఉన్నారు. నిందితుల్లో రహంతుల్లా, సొహైల్‌లు డిగ్రీలో క్లాస్‌మేట్స్. విజయవాడలో ఈ ముగ్గురు నిందితుల కార్యకలాపాలు కొన్ని నెలలుగా సాగుతున్నాయి’ అని వెల్లడించారు.





