News

జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి : అంబేకర్

103views

పరస్పర ఆప్యాయత పెరిగి, వివక్షత తొలిగిపోతే పెద్ద సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. అదే సామరస్యం లేకపోతే, చిన్న సమస్యలు కూడా పెద్ద సంఘర్షణలుగా మారతాయన్నారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు.

ఆరెస్సెస్ కుల గణనకు మద్దతు ఇస్తుంది కానీ, సమాజాన్ని విభజించడానికి ఉపయోగించడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. దేవాలయాలు, శ్మశాన వాటికలు, నీటి వనరుల విషయంలో అందరికీ ప్రవేశం వుండాలని, ఈ విషయంపై స్వయంసేవకులు క్షేత్ర స్థాయిలో మరింత విస్తృతంగా పని చేయాలని సూచించారు.

ఇక… సంఘ్ ప్రేరేపిత సంస్థల గురించి కూడా మాట్లాడారు. విద్యా భారతి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, ఏకల్ విద్యాలయ మరియు సేవా భారతి వంటి సంస్థలు విస్తృతమైన ప్రచార నెట్‌వర్క్‌లో భాగమని ఆయన పేర్కొన్నారు.

ఇక రాష్ట్రీయ సేవికా సమితి అనేది ఆరెస్సెస్ శాఖ నమూనాను పోలి వుంటుందన్నారు. అదే సమయంలో, “మహిళా సంబంధ్” అనే సమన్వయ యంత్రాంగం ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో మరియు ప్రజలను చేరుకోవడంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, అందువల్ల మహిళల పాత్రను విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అంగీకరించారు.

తాజాగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణపై కూడా మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి మద్దతిస్తూ, రాజకీయ ఆశయాల కన్నా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది అని అన్నారు. యుద్ధం అనేది సత్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం జరగాలి కానీ, వ్యక్తిగత లేదా స్వార్థ ప్రయోజనాల కోసం కాదన్నారు. భారత్ ఈ మార్గంలోనే పయనిస్తోందని తాము మన స్ఫూర్తిగా నమ్ముతున్నామని అన్నారు.

ఇక.. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదార్ల విషయంలోనూ విస్పష్ట ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ కి సంబంధించి అక్రమ చొరబాటు దారుల సంఖ్య లక్షల్లో వున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జాతీయ ఐక్యత, సమగ్రత, భద్రతతో పాటు మన వనరులు, ఆర్థిక విషయాలకూ తీవ్రమైన ముప్పు అని అన్నారు. ఈ పరిణామాలు భారం కూడా మోపుతున్నాయని, అంతేకాకుండా వారు అక్రమ ఓటర్లుగా మారి, ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారన్నారు.

జనాభా మార్పులు, జనాభా అసమతుల్యతపై ఉన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ అంబేకర్ వాటిని చారిత్రక పాఠాలతో ముడిపెట్టారు. “తమ పూజా విధానాలు మారినా, తమ పూర్వీకులు, చరిత్ర మాత్రం ఒకటేనని కొందరు అర్థం చేసుకుంటారు. కానీ, తమ సంప్రదాయాలు మారినందున దేశం ఇక తమది కాదని ఒక వర్గం భావించింది. ఇది భారతదేశ విభజనకు దోహదపడింది. లెబనాన్ వంటి ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి దృగ్విషయాన్నే మనం చూస్తాము,” అని ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వం రోడ్లపై నమాజ్‌ను నియంత్రించినప్పుడు, దానిని మతపరమైన ఆంక్షగా కాకుండా శాంతిభద్రతల నిర్ణయంగా చూడాలన్నారు. అలాగే ముస్లింలు అధిక సంఖ్యలో వున్న దేశాలు కూడా రోడ్లపై ప్రార్థనలను అనుమతించరని పేర్కొన్నారు.