
వందల సంఖ్యలో కుటుంబాలు. అందరూ తెలుగువారు. కొన్ని శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస వెళ్లారు. కోయంబత్తూరు, తిర్పూరు, మదురై తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి నల్లరేగడి నేలల్లో చెమట చిందించారు. బంగారు పంటలు పండించారు. వ్యాపారాల్లో ప్రవేశించారు. పరిశ్రమలు స్థాపించారు. ఉన్నత స్థానాలకు ఎదిగారు. తమిళ సంస్కృతిలో మమేకమయ్యారు. తాము తెలుగు వాళ్లమనే విషయాన్ని మాత్రం మరవలేదు. తమ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలన్న తపన మొదలైంది వారిలో. కొందరు అన్వేషణ ప్రారంభించారు.
ఒంగోలు గ్రామీణ మండలం ఉలిచి గ్రామంలో తమ మూలాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ గ్రామంలో చుంచు ఇంటి పేరుతో ఉన్నవారిని సంప్రదించారు. వంశవృక్షం గురించి ఆరా తీశారు. తమ పూర్వీకులు అక్కడి వారేనని నిర్ధారించుకున్నారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు కోయంబత్తూరు నుంచి 15 మంది ఇటీవల ఉలిచికి వచ్చారు. గ్రామానికి చెందిన కంటి వైద్యుడు చుంచు చలమయ్య వారికి నూతనవస్త్రాలు బహూకరించి, జ్ఞాపికలతో సత్కరించారు. ‘మా అన్వేషణ ఫలించింది. ఉలిచికి వచ్చి, ఇక్కడి వారిని కలుసుకొని సంతోషంగా గడిపాం’ అని ఎల్. బాలసుబ్రహ్మణ్యన్ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.
ఘనంగా ఉగాది: శతాబ్దాల కింద విజయనగర సామ్రాజ్యంలో సైనికులుగా, ఆస్థానంలో కీలక ఉద్యోగులుగా పని చేశారు. సామ్రాజ్యం పతనమయ్యాక దక్షిణ తమిళనాడు దిశగా వలస వెళ్లారు. వందల ఏళ్ల క్రితమే అక్కడ స్థిరపడినా తెలుగు పండుగలు, సంస్కృతి, సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నారు. ఉగాదిని ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నదానాలు చేస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పూజలను తెలుగు సంప్రదాయంలో జరుపుకుంటున్నారు. వారిలో ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చెందినవారున్నారు. తమ మూలాలు నంద్యాలలో ఉన్నట్లు తేలిందని టింబరు వ్యాపారి కృష్ణమూర్తి బ్రహ్మనాయుడు చెప్పారు.
పారిశ్రామిక విప్లవం: తమిళనాడులో రెండో పెద్ద నగరమైన కోయంబత్తూరును తీర్చిదిద్దడంలో తెలుగువారి పాత్ర ఎనలేనిది. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక విప్లవానికి పురుడు పోశారు. అక్కడి నేలల్లో పత్తి, శనగ, వేరుసెనగ, మిరప, పొగాకు వంటి వాణిజ్య పంటలు పండించడం మొదలుపెట్టారు. సాగుకు బావుల్లో నీటిని తోడేందుకు మోటార్ల అవసరాన్ని గుర్తించి, వాటి తయారీకి పరిశోధనలు చేశారు. పరిశ్రమలు ప్రారంభించారు. నేడు మనం వినియోగిస్తున్న పేరున్న కంపెనీల మోటార్లు కోయంబత్తూరులోనే తయారవుతున్నాయి.
తెలుగు పరిమళాలు: నగర ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో తెలుగును మరింత స్పష్టంగా మాట్లాడుతున్నారు. భాషను అర్థం చేసుకోగలుగుతున్నారు. రాయలేరు కానీ మాట్లాడేందుకు యత్నిస్తున్నారు. వారుండే ప్రాంతాల్లో గ్రామ దేవతల ఆలయాలు నిర్మించి పూజలు చేస్తున్నారు. బాలాజీ ఆలయం, అక్కమ్మాల్ ఆలయాల్ని చందాలు వేసుకొని నిర్మించారు. కొందరు పారిశ్రామికవేత్తలు పేదల కోసం విద్యాసంస్థలు, ఆసుపత్రులను నడుపుతున్నారు.
నల్లరేగడి నేలల్లో పెద్దఎత్తున పత్తి దిగుబడులను సాధించారు. ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో కొందరు వస్త్ర పరిశ్రమలకు నాంది పలికారు. తొలుత జిన్నింగ్ మిల్లులు, తర్వాత టెక్స్‌టైల్ పరిశ్రమలు నెలకొల్పారు. తిర్పూరులోనూ బనియన్ కాటన్ మిల్లులు ప్రారంభించారు. మెజారిటీ పరిశ్రమలు తెలుగువారివే. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు, కల్యాణ మండపాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. రవాణా రంగంలోనూ రాణిస్తున్నారు. తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జీడీ నాయుడు) నిలువెత్తు విగ్రహాన్ని కోయంబత్తూరులో ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. నగరంలో ముఖ్యమైన ఫ్లైఓవర్‌కు ఆయన పేరు పెట్టి గౌరవించి మనవారి ఘనతకు విశిష్ట గుర్తింపునిచ్చారు.





