ArticlesNews

ఆలయాల్లో అలౌకిక భావన.. అంతరిక్ష

95views

ప్రతి ఆలయానికీ ఒక అంతర్గత శక్తి ఉంటుందని పురాణాలు పేర్కొన్నాయి. దాన్నే సంస్కృతంలో ‘అంతరిక్ష’ అంటారు. ఈ అంతర్గత శక్తి ఆలయ సందర్శకుల పైన పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే ప్రజలు గుడిలోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి ఉద్వేగాలకూ లోనవకుండా ప్రశాంతంగా ఉండాలని, ఆలోచనలూ, అలజడులూ లేకుండా మనసును ఖాళీ గిన్నెలా మార్చుకోవాలని పెద్దలు చెబుతారు. అలాగే ఒక రోజులో అనేక దేవాలయాలకు వెళ్లి, త్వరత్వరగా దర్శనం చేసుకోవడం సరికాదు. ఆలయ సందర్శనం అంటే అదొక మొక్కుబడి వ్యవహారం కాదు. వేగంగా పని పూర్తిచేసుకున్నట్టు వెళ్తే ప్రయోజనమే ఉండదు. అంతకంటే వెళ్లకపోవడమే మేలు. ఒకే రోజులో అనేక ఆలయాలకు వెళ్తే.. ఇక దైవానుభూతి ఏం కలుగుతుంది? ఏం గ్రహించగలుగుతారు? అందువల్ల ఆలయ దర్శనం అంటే… దైవ సన్నిధిని అనుభూతి చెందుతూ, ఆ స్వామిని మనసులో స్థిరం చేసుకోవాలి.

ఒక ఆలయానికి వెళ్లామంటే.. ఆ ప్రభావం మన మీద అనంతంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే.. ఆలయంలో పూజ, ప్రదక్షిణలు పూర్తయ్యాక.. ఒక పక్కన కూర్చుని కళ్లు మూసుకుని ధ్యాన స్థితిలోకి వెళ్లాలి. అలా దైవధ్యానంలో లీనమైనప్పుడు.. ఆలయంలోని రహస్య శక్తులు మనకు సహాయం చేస్తాయి. మన అంతరంగాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తాయి. దైవ సన్నిధి అనుభవంలోకి వస్తుంది. నెమ్మదిగా కళ్లు తెరిచి బయటి ప్రపంచం వైపు చూసినప్పుడు.. లోపల నిశ్చల శాంతితో అలౌకిక భావన కలుగుతుంది. దీనినే మహానుభావులు ‘మనో ప్రసాదం’ అన్నారు. అది ఆలయంలో పంచే చక్రపొంగలి, పులిహోర తదితర భౌతిక ప్రసాదాల కంటే అమృతప్రాయమైంది. అవకాశం ఉంటే ప్రతి నిత్యం ఆలయానికి వెళ్లి కొంత సమయం దైవసన్నిధిలో గడపటం మంచిది. దానివల్ల మనసులో ఉండే ఆందోళనలు, అలజడులు మటుమాయమవుతాయి.