News

గోవుల స్మ‌గ్లింగ్ ను అడ్డుకున్న గో సంర‌క్ష‌కుడిని ట్ర‌క్కుతో ఢీకొట్టిన దుండగులు

68views

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థురలో ఇవాళ తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. స్థానికులకు, పోలీసుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. గో సంర‌క్ష‌కుడి మృతిని ఖండిస్తూ స్థానికులు ఆందోళ‌న చేప‌ట్టారు. కోసి క‌లాన్ ఏరియాలో జాతీయ రహ‌దారిని బ్లాక్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న‌కారుల్ని పోలీసులు చెద‌రగొట్టారు. ఆ స‌మ‌యంలో నిర‌స‌న‌కారులు తిర‌గ‌బ‌డ్డారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. వివ‌రాల్లోకి వెళ్తే.

చంద్ర‌శేఖ‌ర్ అనే వ్య‌క్తికి స్థానిక గో సంర‌క్ష‌కుడిగా గుర్తింపు ఉన్న‌ది. ఆయ‌న్ను బ్ర‌జ్ ప్రాంతంలో ఓ సాధువుగా చూస్తారు. ఫార్సా వాలా బాబాగా కూడా ఆయ‌న్ను పిలుస్తారు. అయితే రాత్రి ఓ ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఆయ‌న చ‌నిపోయారు. గోవుల‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న ట్ర‌క్కును అడ్డుకోవ‌డంతో.. చంద్ర‌శేఖ‌ర్‌ను ఢీకొట్టి వెళ్లిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్ర‌మాదంలో అత‌ను మ‌ర‌ణించి ఉంటార‌ని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో స్థానికంగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం… చంద్ర‌శేఖ‌ర్ త‌న మోటారుబైక్‌పై గోవులు స్మ‌గ్లింగ్ చేస్తున్న ట్ర‌క్కును చేజ్ చేశాడు. అయితే ఆ క్ర‌మంలో నిందితులు ట్ర‌క్కుతో అత‌న్ని ఢీకొట్టిన‌ట్లు భావిస్తున్నారు. తీవ్రంగా గాయప‌డ్డ చంద్రశేఖ‌ర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన సమ‌యంలో ఓ వ్య‌క్తిని అప్పుడే ప‌ట్టుకున్నారు. మ‌రో ముగ్గురు ప‌రారీ అయిన‌ట్లు తెలుస్తోంది. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. చంద్ర‌శేఖ‌ర్‌ను ఢీకొట్టిన వాహ‌నాన్ని ప‌రిశీలిస్తున్నారు. నిజానికి దాన్ని గోవుల‌ను త‌రించేందుకు వాడారా లేదా అన్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

గో సంర‌క్ష‌కుడు చంద్ర‌శేఖ‌ర్ మృతి ప‌ట్ల స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గో సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌డుతూ స్థానికంగా చంద్ర‌శేఖ‌ర్ మంచి పేరు తెచ్చుకున్నారు. బ్రజ్ ప్రాంతంలో ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. శాంతి భ‌ద్ర‌తల నేప‌థ్యంలో స‌మీప ప్రాంతాల్లో సెక్యూర్టీని పెంచారు.