ArticlesNews

ఛత్రపతి శంభాజీ మహారాజ్ వ్యూహం: బ్రిటీష్ వారిని సిద్ధీలకు వ్యతిరేకంగా ఎలా తిప్పికొట్టారు?

90views

ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం, స్వరాజ్య బాధ్యతలను ఛత్రపతి శంభాజీ మహారాజ్ స్వీకరించిన సమయంలో సిద్ధీల నుండి ఆయనకు పెద్ద సవాలు ఎదురైంది. ఔరంగజేబు మద్దతుతో, జంజీరా పరిపాలనలోని సిద్ధీ కమాండర్ సిద్ధీ ఖాసిం.. నాగోథానే, పెన్ వంటి మరాఠా ప్రాంతాలలో దోపిడీలు, దహనకాండలు మరియు హిందూ దేవాలయాల విధ్వంసంతో భీభత్సం సృష్టించాడు. ఈ క్రమంలో మరాఠాలతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బ్రిటీష్ వారు సిద్ధీలకు రహస్యంగా సహకరిస్తున్నారు. అందుకే, స్వరాజ్యానికి అడ్డుపడుతున్న సిద్ధీలను, వారికి వెన్నుదన్నుగా ఉన్న బ్రిటీష్ వారిని అదుపు చేయడానికి శంభాజీ మహారాజ్ ఒక శక్తివంతమైన మరియు దూకుడు వ్యూహాన్ని రూపొందించారు. దీని ప్రభావం త్వరలోనే ‘రాజాపూర్’ ఘటనలో స్పష్టంగా కనిపించింది.

దక్షిణ కొంకణ్‌లోని ఒక నదీ ముఖద్వారం వద్ద ఉన్న రాజాపూర్, ఆ కాలంలో వ్యూహాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వాణిజ్య కేంద్రం. అప్పట్లో బ్రిటీష్ వారి ప్రధాన అధికారం, పరిపాలన, నౌకాబలం మరియు వారి గవర్నర్ ముంబై కేంద్రంగా ఉండేవారు. కానీ, ఈ రాజాపూర్ ఫ్యాక్టరీ మాత్రం మరాఠా గడ్డపై ఉండేది. సాంకేతికంగా బ్రిటీష్ వారు దీనిని నడుపుతున్నప్పటికీ, ఇది స్వరాజ్య చట్టాలకు లోబడి ఉండేది. అందుకే, సిద్ధీలకు సహకరిస్తున్న బ్రిటీష్ వారికి గుణపాఠం చెప్పడానికి, శంభాజీ మహారాజ్ తనదైన శైలిలో వారిని ఎదుర్కొన్నారు.

సుమారు 1680 మే నెలలో, స్వరాజ్య రాజకీయ పరిస్థితుల్లో వస్తున్న మార్పులను గమనించిన రాజాపూర్ బ్రిటీష్ వ్యాపారులు, తమ ఆస్తులను మరియు సంపదను సురక్షితంగా ముంబైకి తరలించడానికి అనుమతి కోరారు. వారు ఈ విన్నపాన్ని స్థానిక సుబేదార్ ముందు ఉంచినప్పుడు, ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు—అందరూ ప్రేమగా ‘శంభు రాజే’ అని పిలుచుకునే ఛత్రపతి శంభాజీ మహారాజ్ నుండి అధికారిక అనుమతి పొందాలని చెప్పారు. అయితే, మహారాజ్ వారి దరఖాస్తును నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. “ప్రస్తుతం నేను ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నాను” అని ఖరాకండిగా సమాధానమిచ్చారు. ఇది కేవలం సాధారణ తిరస్కరణ మాత్రమే కాదు; సిద్ధీలకు ఆశ్రయం ఇస్తున్నందుకు బ్రిటీష్ వారిపై ప్రకటించిన ‘దౌత్యపరమైన’ సహాయ నిరాకరణ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించిన బ్రిటీష్ వారు, ఇప్పుడు కొత్త ఛత్రపతి యొక్క కఠినమైన విధానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అంతేకాకుండా, సిద్ధీలకు సహకరిస్తున్న బ్రిటీష్ వారికి తగిన గుణపాఠం చెప్పడానికి, శంభాజీ మహారాజ్ తన సైన్యాన్ని రాజాపూర్ ఫ్యాక్టరీపై దాడి చేయాల్సిందిగా ఆదేశించారు. మరాఠా సైన్యం యొక్క పరాక్రమానికి భయపడి, బ్రిటీష్ అధికారులు ఆ ఫ్యాక్టరీ నుండి బయటకు రావడానికి కూడా సాహసించలేకపోయారు. అనంతరం, సిద్ధీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి, శంభు రాజే తన చతురత కలిగిన రాయబారి ఆవ్జీ పండిట్‌ను 1680 నవంబర్ 20న ముంబైకి పంపారు. ఆవ్జీ పండిట్‌కు రెండు ప్రధాన బాధ్యతలు అప్పగించబడ్డాయి: మొదటిది, బ్రిటీష్ వారికి యుద్ధ హెచ్చరిక జారీ చేయడం; రెండోది, సిద్ధీల కదలికలను రహస్యంగా గమనించడం. ప్రణాళిక ప్రకారం, ఆవ్జీ పండిట్ బ్రిటీష్ ప్రతినిధులను కలిసి—శివాజీ మహారాజ్ కాలంలో జరిగిన ఒప్పందం ప్రకారం సిద్ధీలను అదుపు చేయకపోతే, శంభాజీ రాజే ముంబైపై యుద్ధం ప్రకటిస్తారని స్పష్టంగా హెచ్చరించారు.

బ్రిటీష్ వారు అటు మరాఠాలు, ఇటు సిద్ధీల మధ్య నలిగిపోయి.. ‘ముందు నుయ్యి – వెనుక గొయ్యి’ అన్న చందంగా తయారయ్యారు. ఒకవైపు మరాఠాల భయం, మరోవైపు ఔరంగజేబు ఒత్తిడిలో ఉన్న సిద్ధీలు వారిని ఇబ్బంది పెడుతున్నారు. అయితే, ఆవ్జీ పండిట్ కొంతకాలం ముంబైలోనే ఉండిపోయారు. ఆయన తిరుగుప్రయాణమైనప్పుడు, బ్రిటీష్ వారు ఆయనకు మరియు శంభాజీ మహారాజ్ కోసం అనేక బహుమతులను పంపారు. వీటి ద్వారా మహారాజును ప్రసన్నం చేసుకుని, కొంకణ్ తీర ప్రాంతాల నుండి తమకు అందాల్సిన బియ్యం సరఫరాను తిరిగి పొందవచ్చని వారు ఆశించారు.

కానీ, 1681 మార్చి 16న సిద్ధీలు మరాఠా నౌకలను బంధించడంతో బ్రిటీష్ వారి ప్లాన్ రివర్స్ అయింది. అదే సమయంలో, ఒక మరాఠా అధికారి 3,000 మంది సైనికులతో చౌల్ (Chaul) వద్ద తిష్టవేసి, ఆ నౌకలను వెంటనే అప్పగించాలని కఠినంగా డిమాండ్ చేయడంతో బ్రిటీష్ వారు వణికిపోయారు. శంభాజీ మహారాజ్ యొక్క దూకుడు వైఖరికి భయపడి, బ్రిటీష్ వారు వెంటనే సిద్ధీల నుండి ఆ నౌకలను విడిపించి మరాఠాలకు అప్పగించారు. ఇది శంభు రాజే పెంచుకున్న భయం మరియు ఆయన సాగించిన అద్భుతమైన దౌత్య నీతికి నిదర్శనం. దీనివల్ల బ్రిటీష్ వారు సిద్ధీలకు వ్యతిరేకంగా వెళ్లి మరీ మరాఠాల మాట వినక తప్పలేదు.

బ్రిటీష్ వారిని లొంగదీసుకోవడం అనేది ఒక భాగం మాత్రమే; అసలు పోరాటం సిద్ధీలతోనే ఉంది, వారి ఆగడాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. 1680 జనవరి 9న అండీరీ (Underi) ద్వీపంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుండి, సిద్ధీలు నిరంతరం మరాఠా సామ్రాజ్య తీరప్రాంతాన్ని వేధిస్తూనే ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా శంభాజీ మహారాజ్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అరబ్ నౌకాదళం సహకారంతో అండీరీ ద్వీపాన్ని తన ఆధీనంలోకి తీసుకుని, అక్కడ కోట నిర్మాణాన్ని ప్రారంభించారు.

మరోవైపు, సిద్ధీల నౌకాబలానికి జంజీరా కోట ప్రధాన కేంద్రంగా ఉన్నందున, మరాఠాలు ఏకకాలంలో జంజీరాను కూడా ముట్టడించారు. మరాఠాల ఈ ద్వంద్వ దాడి సిద్ధీలను మాత్రమే కాకుండా, వారికి రహస్యంగా సహాయం అందిస్తున్న బ్రిటీష్ వారిని కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. 1682 ప్రారంభంలో, ఆహార ధాన్యాలను తీసుకెళ్తున్న మూడు బ్రిటీష్ పడవలను మరాఠాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యతో బ్రిటీష్ వారు ఎంతగా నిస్సహాయులయ్యారంటే, వారు శంభు రాజే రాయబారి సుందర్జీ బాజీ ముందు మోకరిల్లి, తమ పడవలను విడిపించమని వేడుకోవాల్సి వచ్చింది.

ఈ సంఘటన తర్వాత, 1682 జనవరి 19న ముంబైలోని బ్రిటీష్ అధికారులు సూరత్‌లోని తమ పైఅధికారులకు ఒక లేఖ రాస్తూ ఇలా తెలిపారు: “ఒకవేళ సిద్ధీలు మరాఠాలను వేధించడం ఆపకపోతే, శంభాజీ రాజే ఏ క్షణమైనా ముంబైపై దాడి చేయవచ్చు. ఆయనను అడ్డుకోవడం మనకు అసాధ్యం.” సూరత్‌లోని బ్రిటీష్ వారు ఔరంగజేబుకు భయపడి సిద్ధీలను బహిరంగంగా వ్యతిరేకించలేదు కానీ, శంభు రాజే పరాక్రమానికి భయపడి లోలోపల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు.

మరోవైపు సిద్ధీల అమానుష ప్రవర్తన పరాకాష్ఠకు చేరుకుంది. ఔరంగజేబు అండ చూసుకుని, సిద్ధీలు స్వరాజ్యంలోని అమాయక పిల్లలను అపహరించి, వారిని ముంబై మార్కెట్లలో బానిసలుగా విక్రయించే భయంకరమైన దురాచారాన్ని ప్రారంభించారు. స్వరాజ్య ప్రజలపై జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ఛత్రపతి శంభాజీ మహారాజ్ అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించారు. ఆయన బ్రిటీష్ వారికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడంతో, ఆ భయం వల్ల వారు చివరకు వెనక్కి తగ్గక తప్పలేదు.

అదే సమయంలో, మహారాజ్ కరంజా ద్వీపాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో, బ్రిటీష్ వారు భయపడి వెంటనే 1684 ఏప్రిల్‌లో కెప్టెన్ గ్యారీని రాయబారిగా పంపి శంభాజీ రాజేతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం నిబంధనలు ఖరారయ్యాయి, దీని ద్వారా ఛత్రపతి శంభాజీ మహారాజ్ బ్రిటీష్ వారిపై తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ కీలక ఒప్పందం కారణంగా, శంభాజీ మహారాజ్ కోరుకున్నట్లుగానే బ్రిటీష్ వారు ముంబైలో సిద్ధీలకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. దీని ఫలితంగా, మహారాజు కాలం ముగిసే వరకు మరాఠా గడ్డపై సిద్ధీల ఆగడాలు పూర్తిగా ఆగిపోయాయి.