
రాష్ట్రంలో దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయ భూములను ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ అన్నారు. ప్రస్తుతం ఎండోమెంట్స్ శాఖ ఆధీనంలో ఉన్న సుమారు 1.5 లక్షల ఎకరాల దేవాలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నం. 139 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను 33 సంవత్సరాలపాటు దీర్ఘకాల లీజుకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు.
విజయవాడలోని గొల్లపూడి గొడుగుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ఫ్ కోర్ట్‌ల కోసం కేటాయించారని ఆయన తెలిపారు. అలాగే కాకినాడలోని శ్రీ భావనారాయణ స్వామి దేవాలయ భూములను క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించగా ఆ అంశాన్ని కోర్టు ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని ఐదు గ్రామాల్లో దేవాలయ భూములపై ఆక్రమణలు జరిగినప్పటికీ వాటిని రక్షించాల్సింది పోయి అక్రమాలను రాజకీయ ప్రయోజనాల కోసం రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశారని విమర్శించారు. అంతేకాకుండా సింహాచలం దేవాలయ భూములను గూగుల్ మరియు ఇతర ఐటీ కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు.
ఎన్‌టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో దేవాలయ భూములలో వందల ఎకరాలను రికార్డులు మార్చి ప్రైవేటు వ్యక్తుల పేర్లకు బదిలీ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయని వీహెచ్‌పీ నేత పేర్కొన్నారు. తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణం కోసం దేవాలయ భూములను కేటాయించే అంశం కూడా కొనసాగుతోందని తెలిపారు.
దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో “హిందూ శంఖారావ సభ” నిర్వహించామని తెలిపారు. దేవాలయ స్వయం ప్రతిపత్తి ఉద్యమం బలపడక ముందే దేవాలయ భూములను పూర్తిగా పంపిణీ చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. దేవాలయ భూములను పంచే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించి ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర కోశాధ్యక్షులు వి. దుర్గా ప్రసాద్ రాజు, వీహెచ్‌పీ విజయవాడ మహానగర్ కార్యదర్శి పి.శ్రీహరి పాల్గొన్నారు.





