
తిరుమల శిఖరాలు ఎంత పవిత్రమో, తిరుపతి పరిసర ప్రాంతాలూ అంతే పవిత్రం. ఆ ప్రదేశంలో వెలసిన అనేక పుణ్యక్షేత్రాలు అందుకు నిదర్శనం. వాటిలో కోదండరామాలయం ఒకటి. పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యమున్న ఈ కోవెల భక్తులకు దివ్యానుభూతుల నిలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు గోవిందరాజుల మందిరం తర్వాత విధిగా సందర్శించే ఆలయమిది.
ఏడుకొండలపై ఆనందనిలయంలోని శ్రీనివాసుణ్ణి తలపిస్తూ కోదండరామాలయంలో శ్రీరాముడు స్థానక భంగిమ అంటే నిలబడి ఉండి భక్తులకు దర్శనమిస్తాడు. విశాలమైన కోదండరామాలయ ప్రాంగణం ఎన్నో ఆధ్యాత్మికోత్సవాలకు వేదికగా నిలుస్తోంది. అంతేకాదు ఎందరో పారమార్థిక సాధకులు నేటికీ నిష్ఠగా రామజపం చేస్తూ ఈ కోవెలలో ఆధ్యాత్మికోన్నతిని సాధిస్తూ ఉన్నారు. ఈ మందిరానికి ఎదురుగా భక్తాంజనేయ స్వామి కొలువయ్యాడు. ఏనుగుల వీరాస్వామి కాశీయాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో తిరుమలతో పాటు కోదండరామాలయాన్నీ దర్శించారు. ఆలయ విశేషాలను, తన అనుభవాలూ అనుభూతులను ‘కాశీయాత్ర చరిత్ర’లో అక్షరీకరించారు.
పురాణ నేపథ్యం : వరాహ పురాణాన్ని అనుసరించి రామభక్తుడైన జాంబవంతుడు ఈ ప్రాంతంలో నడయాడాడు. రామదర్శనంతో పరవశుడై, శ్రీరాముడి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ గుహ ఉండేది. జాంబవంతుడు ఆ గుహలోనే రాముణ్ణి స్మరించేవాడని, గుహలోంచి వెలుగు ప్రసరించేదని స్థలపురాణం పేర్కొంది. జనమేజయ చక్రవర్తి కోదండ రామాలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజాదికాలతో పునరుద్ధరించాడని, స్థానిక కొలనులో రాములవారి విగ్రహాలు జనమేజయుడికి లభించాయని,ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించిన ఆనవాళ్లు ఉన్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళ రాజులు పునర్నిర్మించారని, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు సహా ఎందరో విజయనగర రాజులు ఈ ఆలయానికి సాయం అందించారని చారిత్రక గ్రంథాల్ని బట్టి తెలుస్తోంది.
శిల్పకళకు నెలవు: కోదండరామాలయంలోని ముఖమండపం, ప్రదక్షిణ మండపం, అంతరాలయ, గర్భాలయాలు భారతీయ శిల్పకళకు ప్రతీకగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ కోవెలలో విజయనగర కాలం నాటి శిల్పకళారీతులు ఉట్టిపడుతుంటాయి. ఆ మూలమూర్తులు దివ్యతేజస్సుతో అలరారుతుంటాయి. ధనుర్బాణాలను ధరించిన శ్రీరామచంద్రమూర్తికి కుడివైపున సీతాదేవి, ఎడమవైపున లక్ష్మణస్వామి కూడా అన్న మాదిరి ధనుర్బాణాలు ధరించి దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో విశేషంగా కల్యాణరాముడు నొసటన ఊర్ధ్వపుండ్రాలు ధరించి, చిన్మయహాసంతో తిరుమల శ్రీనివాసుణ్ణి తలపిస్తాడు. ఈ ఆలయంలో నిత్యం రాత్రివేళ తూగుటుయ్యాలలో బాలకృష్ణునికి పవళింపు సేవ జరగటం విశేషం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవేంకటేశ్వరుడు ఒక్కరే అనటానికి కోదండరామాలయంలో జరిగే అనేక ఉత్సవాలే తార్కాణం.
తేజోమయంగా ఉత్సవమూర్తులు..
గర్భాలయంలో మూలమూర్తులతో పాటు ఆలయంలోని పంచలోహ ఉత్సవమూర్తులు భక్తులపై అనుగ్రహవృష్టిని కురిపిస్తుంటాయి. భక్తాంజనేయ స్వామి పంచలోహమూర్తి, బాలకృష్ణుని దివ్యమంగళ ప్రతిమ, చక్రత్తాళ్వార్ పంచలోహ విగ్రహాలు కూడా తిరుపతి కోదండరామాలయంలో మూలమూర్తులతో పాటు పూజలందుకుంటున్నాయి. శ్రీరాముని సన్నిధిలో శ్రీవేంకటేశ్వరుని సేనాధిపతి విష్వక్సేనుడి శిలావిగ్రహం దర్శనమివ్వటం విశేషం. అలాగే రామానుజాచార్యుల వారి శిలాప్రతిమ కోదండరామాలయం వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తోంది.తిరుపతి కోదండరామ స్వామికి ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈసారి మార్చి 17న ప్రారంభం కానున్నాయి. 25వ తేదీతో ముగిసే ఈ వేడుకల్లో ఆలయ ఉత్సవ మూర్తులను వివిధ వాహనాలపై వైభవంగా ఊరేగిస్తారు.
తిరుమల శ్రీవేంకట్వేరుని బ్రహ్మోత్సవాల తీరులోనే కోదండరామాలయంలోనూ చిన్నశేష, పెద్దశేష, గరుడ, హనుమద్ తదితర వాహనాల్లో శ్రీరామచంద్రమూర్తిని సపరివారంగా ఊరేగిస్తారు. ధ్వజారోహణంతో ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు.





