ArticlesNews

సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశం

107views

భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఐతిహ్యం ఒక అమూల్యమైన సందేశాన్నిస్తుంది. వాటన్నింటి మూలం భక్తి. జ్ఞానం, శక్తియుక్తులను సద్వినియోగం చేసుకోవాలంటే భక్తి ఉండాలి. ఈ దిశగా అష్టావక్ర మహర్షి చూపిన మార్గం వెలుగుకిరణంలా నిలుస్తుంది.

ఎనిమిది వంకరలతో జన్మించిన అష్టావక్రుణ్ని అందరూ హేళన చేసేవారు. కానీ ఆయన బాధపడలేదు. ‘నన్ను చూడొద్దు, నా ఆత్మను చూడండి’ అన్నట్లుగా ఆయన తన జ్ఞానాన్ని ఆకాశమంత విస్తరింపచేశాడు. ఇది గొప్ప పాఠం. రూపం కాదు, ఆత్మగుణమే నిజమైన సంపద. అవమానం కలిగినా, ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ధర్మంపై విశ్వాసం ఉంచితే ప్రపంచమే మనకు వందనం చేస్తుంది.

జనక మహారాజు ఎందరో మునుల దగ్గర విద్యలు అభ్యసించినా, విముక్తి అసలు తత్త్వమేంటో తెలుసుకోవాలని తపించాడు. అప్పుడు అష్టావక్ర మహర్షిని గురువుగా స్వీకరించాడు. ‘రాజా! నువ్వు అంటే- నీ శరీరం కాదు, మనసు కాదు. నువ్వు నిరాకారమైన, నిత్యమైన, పరమ శుద్ధమైన ఆత్మవు. బంధమూ, విముక్తీ మనసులోనే పుడతాయి. ఎవడు ఇంద్రియాలలో ఆసక్తి లేకుండా సాక్షిగా నిలుస్తాడో వాడు విముక్తుడు. అనుభవాలు వస్తాయి పోతాయి కానీ, నువ్వు మాత్రం మారని సాక్షివి’ అని బోధించాడు అష్టావక్రుడు. ‘ఇప్పటి వరకు నేను నిద్రలో ఉన్నట్టున్నాను. ఇప్పుడు నిజం తెలిసింది. నేను ఆత్మనే, శాశ్వతమైన చైతన్యాన్నే’ అంటూ సత్యాన్ని అవగాహనకు తెచ్చుకున్నాడు జనకుడు.

అష్టావక్ర బోధనలు ఉపనిషత్తులు, గీత, యోగవాశిష్ఠం చెప్పిన తత్వాలతో సమానంగా ఉంటాయి. శరీరమనే గుహలో ఆత్మ- పరమాత్మ ఇద్దరూ ఉన్నారంటుంది కఠోపనిషత్‌. ఒకే వృక్షంపై రెండు పక్షులు కూర్చున్నాయి. ఒకటి పండును తింటుంది (జీవుడు), మరొకటి చూస్తూ ఉంటుంది (పరమాత్మ)… అని ముండకోపనిషత్‌ చెబుతోంది. కాబట్టి భగవంతుడి కృపకు పాత్రులు కావాలంటే జీవికి భగవత్‌ దృష్టి ఉండాలి. మనసే సంసారం, మనసు ఆగితే బంధమూ ఆగిపోతుంది. ఆ మనసు భగవంతుడితో ముడిపడి ఉండాలని యోగవాశిష్ఠం చెబుతోంది.

రూపం కాదు, గుణమే ముఖ్యం. నిజమైన విముక్తి అంటే బాహ్య మాయను విడిచి ఆత్మలో నిలబడి దైవాన్ని తెలుసుకోవడం. బాహ్యరూపం కాదు, మనలోని ఆత్మ- ధర్మభక్తి మాత్రమే శాశ్వతమని పురాణాలు చెబుతున్నాయి. నిజమైన భక్తి అంటే దేవుడిపై నమ్మకంతో పాటు మనలోని సద్గుణాలను కాపాడుకోవడం కూడా. భక్తి ఉన్న మనసు కోపం, భయం, అసూయ, దుఃఖం అన్నింటిని కరిగిస్తుంది. దైవభక్తి, ధర్మం, జ్ఞానం- ఈ మూడు మూలస్తంభాలు కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది.

ధర్మ పరిరక్షణకు బద్ధులైన వారినే ప్రపంచం గౌరవిస్తుంది. జ్ఞానం వినయంతో కలిసి ఉండాలి. వ్యక్తి జీవితానికి మంచిబాట వేసే భక్తిని అలవరచుకోవాలి. అది జీవితాల్లో దివ్యజ్యోతులను నింపుతుంది. సత్యం చెప్పడానికి ఎవరూ భయపడకూడదు. ఇతరులకు సాయం చేయడానికి వెనకాడకూడదు. ఈ రెండు విశిష్ట లక్షణాలూ భక్తితోనే మన సొంతమవుతాయి.