News

కెనడాలో భారత యువకుడి హత్య! మూకుమ్మడిగా దాడి చేసి..

107views

కెనడాలో ఇటీవల ఒక భారతీయ యువకుడు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. బాధితుడి కాలేజీకి చెందిన 10-12 మంది యువకులు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన కన్నుమూశాడని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఫోర్ట్ సెయింట్ జాన్ నగరంలో మార్చ్ 14న ఈ ఘటన జరిగింది. మృతుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన గురుకిరత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.

ఉజ్జెయిన్‌కు చెందిన గురుకిరత్ సింగ్ (23) మేనేజ్‌మెంట్ విద్య కోసం కెనడా వెళ్లారు. అక్కడి నార్తన్ లైట్స్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వాల్‌మార్ట్‌లో పార్ట్ టైమ్‌గా జాబ్ చేస్తున్నారు. ఇక ఘటన జరిగిన రోజు రాత్రి గురుకిరత్ వాల్‌మార్ట్‌లో తన జాబ్ ముగించుకుని బయటకు రాగా, అదే కాలేజీకి చెందిన 10-12 మంది యువకులు అతడిని తమ వెంట తీసుకెళ్లారని కుటుంబసభ్యులు తెలిపారు. అప్పటికే వారి మధ్య ఉన్న ఒక వివాదం మళ్లీ చర్చకు రావడంతో గొడవ జరిగిందన్నారు. ఈ క్రమంలో కొందరు యువత గురుకిరత్‌పై దాడి చేసి ఆపై తమ వాహనాన్ని అతడిపై నుంచి తోలడంతో బాధితుడు తీవ్రగాయాలపాలై మరణించాడని చెప్పారు.

గురుకిరత్‌ సింగ్‌పై దాదాపు 12 మంది దాడి చేశారని అతడి సోదరుడు ప్రభుకిరత్ సింగ్ చెప్పారు. తన సోదరుడి మృతి గురించి అర్ధరాత్రి ఫోన్ వచ్చిందని అన్నారు. అది విని తాము దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. కొందరిని పోలీసులు అప్పటికే అరెస్టు చేశారని, ఆ తరువాత వారి లాయర్లు రావడంతో విడిచిపెట్టారని చెప్పారు.

గురుకిరత్ మృతి విషయాన్ని కెనడా అధికారులు కూడా ధ్రువీకరించారు. అతడి పోస్టు మార్టం నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురుకిరత్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సాయపడాలని మృతుడి కుటుంబం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.