ArticlesNews

పురాణేతిహాసాల్లో మార్గదర్శనం చేసిన మహిళలెందరో…

121views

ఊహ తెలి సింది మొదలు వృద్ధాప్యం వరకూ ఇంటా బయటా అందరితో అణకువగా ఉంటూ అభిమానం పంచే దయార్ద్రహృదయ స్త్రీ. అపురూప లక్షణాలతో, అద్భుత వ్యక్తిత్వంతో మార్గదర్శనం చేసిన మహిళలెందరో మన పురాణేతిహాసాల్లో ఉన్నారు. 

సమాజంలో మన అస్తిత్వాన్ని, స్వాభిమానాన్ని నిలబెట్టుకునేందుకు ధైర్యం కావాలి. మనతోపాటు మనవారినీ అభివృద్ధి పథాన నిలపాలంటే త్యాగశీలత చూపాలి. ఈ రెండూ ఉన్నప్పుడు ఆదర్శమూర్తులవుతారు. కుంతి, సుమిత్రలు త్యాగానికి; సీత, ద్రౌపదులు ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచారు.

సత్వగుణ సమేత సుమిత్ర

పట్టమహిషి కౌసల్య, రాజమాత కైకేయిల నీడలో మరుగున పడిపోయిన పాత్ర సుమిత్ర. అంతర్గతంగా రామాయణ కథాగమనాన్ని ముందుకు నడిపిన త్యాగశీలి ఆమె. దశరథుని భార్యగా, లక్ష్మణ, శతృఘ్నుల తల్లిగా ఆమె నిస్వార్థ ప్రవృత్తి ఆ వంశాన్ని ఆదర్శంగా నిలబెట్టింది. అర్హుడైన తన కొడుకు రాజు కాలేదని తల్లడిల్లిన తల్లి కౌసల్య, అర్హత లేని తన పుత్రుణ్ణి రాజును చేయాలని అల్లకల్లోలం చేసిన తల్లి కైకేయి. వారిమధ్య తన ఇద్దరు బిడ్డల్ని.. ఒకరిని భగవత్‌ సేవకు, మరొకరిని భాగవత సేవకు అంకితం చేసిన త్యాగశీలి సుమిత్ర. అరణ్యవాసంలో రాముడికి రక్షణ కవచంగా తన బిడ్డను నిలబెట్టింది. రాముణ్ణి తండ్రిగా, సీతను తల్లిగా, అరణ్యాన్ని అయోధ్యగా భావించమని, ఏమరపాటు కూడదని పుత్రుడికి కర్తవ్యబోధ చేసింది. రాముడు వనవాసానికి వెళ్లగా.. మృత్యుశయ్యపై దశరథుడు, దుఃఖంలో కౌసల్య, పశ్చాత్తాపంలో కైకేయి, ఆవేదనలో భరతుడు ఉన్న స్థితిలో అన్నీ సహించి ‘క్షమయా ధరిత్రీ’ అని నిరూపించింది సుమిత్ర.

త్యాగానికి ప్రతిరూపం కుంతి

సముద్ర గాంభీర్యం, వైశాల్యం, వైవిధ్యం, వైరుధ్యం అన్నీ కలగలిపితే కుంతి జీవితం. అడుగడుగునా పరీక్షలూ త్యాగాలే. ఆమె సేవాగుణానికి మెచ్చి దుర్వాసుడు ఇచ్చిన వరం శాపంగా పరిణమించింది. బాల్యచాపల్యంతో ఆ మంత్రాన్ని పరీక్షించడం వల్ల కన్యగానే కర్ణుడికి జన్మనిచ్చింది. అవివాహిత మాతృత్వాన్ని అంగీకరించని సమాజంలో- తనను కన్నవాళ్లకు మానసికంగా, తాను కన్నవాడికి భౌతికంగా దూరమైంది. కవచకుండలాలతో జన్మించిన బిడ్డను సైతం రాబోయే అవమానాలకు భయపడి కాలువపాలు చేసింది. ఈ ఘటన కుంతిలో వైరాగ్య భావనకు పునాది వేసింది. ఆమె జీవితాన్ని నిరంతరం దహించే రహస్య వేదనగా మిగిలిపోయింది. యుక్తవయసులో భర్త మరణం, పడగ నీడ లాంటి ధృతరాష్ట్రుని పంచలో జీవనం, క్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడని వ్యక్తులుగా బిడ్డల్ని తీర్చిదిద్దటం, రాయబార సమయంలో రాజధర్మాన్ని మరిచిన బిడ్డలకు కర్తవ్యబోధ.. ఆమె ఔన్నత్యానికి మచ్చుతునకలు. సవతి బిడ్డల్ని కూడా సొంత పిల్లల్లా తీర్చిదిద్దగలదని మాద్రి విశ్వసించటం కుంతి సమదృష్టికి నిదర్శనం. చక్రవర్తులైన బిడ్డల సన్నిధిలో రాజమాత హోదాలో హాయిగా కాలం గడపాల్సిన సమయంలో.. తమను బాధించినవారికి సేవకురాలైన కుంతి త్యాగానికి పరాకాష్ఠ. చిన్న సమస్యలకే బెదిరి, అవాంఛిత ఘటనలకు పాల్పడేవారు- కష్టాల కొలిమిలో నిగ్గుతేలిన కుంతీదేవిని ఆదర్శంగా తీసుకోవాలి.

అగ్నిపునీత సీత

సహనానికి మారుపేరు సీత. భూమి పుత్రిక అయిన ఆమె నేలతల్లి సహనాన్ని, దృఢత్వాన్ని పుణికిపుచ్చుకుంది. ఆత్మీయులతో ఆహ్లాదంగా గడిపే అవకాశం ఉన్నప్పటికీ భర్త వెంట అరణ్యాలకు బయల్దేరిన ధీరవనిత. రావణలంకలో అశోకవనంలో గడిపిన కాలం సీత మనోనిబ్బరానికి నిలువుటద్దం. చుట్టూ భయానక రాక్షస స్త్రీలు బెదిరిస్తున్నా, రావణుడు ప్రలోభపెడుతున్నా- తనదైన వ్యక్తిత్వాన్ని, రాముడిపై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. లోకం దృష్టితో తన శీలాన్ని శంకించిన భర్త కళ్ల ముందు అగ్గిలో దూకి పూమొగ్గలా లేచిన అగ్ని పునీత సీత. రెండోసారి అడవుల పాలైన సీత గర్భవతి, పైగా ఒంటరి. అయినప్పటికీ స్థితప్రజ్ఞతతో తనను తాను దృఢమైన తల్లిగా మలచుకుంది. లవకుశుల్ని శాస్త్రవిద్య, శస్త్రవిద్యల్లో తీర్చిదిద్ది, భవిష్యత్తులో రాజ్యపాలనకు వారిని సంసిద్ధుల్ని చేసింది. కర్తవ్యం ముగిసిన మరుక్షణం తన జీవితానికి తానే సరిహద్దు నిర్ణయించుకుంది, రాజీపడని స్థిరత్వంతో తల్లి భూదేవిలో ఐక్యమైంది.

స్వాభిమానానికి చిరునామా ద్రౌపది

జీవితమంతా పోరాటాలతోనే ఉన్నా ధర్మాన్ని, స్వాభిమానాన్ని విడనాడని ధీర ద్రౌపది. రాజ కుటుంబంలో పుట్టి, జగదేకవీరులైన ఐదుగురు భర్తలు ఉండి కూడా ఘోర అవమానాల్ని పొందిందామె. బంధుమిత్రుల ముందు వస్త్రం లాగిన (దుశ్శాసనుడు) వాడొకడు. అన్న వరసై ఉండి కూడా అపహరించిన (దుశ్శల భర్త అయిన జయద్రథుడు) వాడొకడు. భర్తల ఎదుటే కాళ్లతో తన్నిన (కీచకుడు) వాడొకడు. ఆదమరచి నిద్రిస్తున్న ఐదుగురు బిడ్డల ఆయువు తీసినవాడు (ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ.. ఉపపాండవు లను చంపాడు) మరొకడు. ఇలా తన చుట్టూ ఉన్నవారు రాబందుల్లా ప్రవర్తించినా కూడా ఎవరి ముందూ మోకరిల్లలేదు. తప్పు అనిపించినప్పుడు కట్టుకున్న భర్తల్ని కూడా నిలదీసి తన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్న ఉత్తమురాలు ద్రౌపది. దైవాన్ని విశ్వసిస్తూనే.. మానవ ప్రయత్నానికి పెద్దపీట వేసింది. శాంతి మహోన్నతమైనప్పటికీ.. పరాక్రమాన్ని ప్రదర్శించాల్సిన చోట శాంతంగా ఉండటం క్షత్రియధర్మం కాదని భర్తలకు హితవు పలికిన రాచబిడ్డ ద్రౌపది. అన్యాయం ఎదురైనప్పుడు మౌనంగా రోదించటం కాదు.. ఎదిరించి పోరాడాలనే సందేశాన్ని అందించిందామె.
ఈ స్త్రీ మూర్తుల జీవితాల్ని పరిశీలించినప్పుడు- త్యాగానికి, ధైర్యానికి ఉన్న స్థానమేమిటో అర్థం అవుతుంది. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని కుటుంబ హితం, సమాజ శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకున్నారు. త్యాగం అంటే కోల్పోవడం కాదని, భవిష్యత్తుకు పునాది వేసుకోవడం అని నిరూపించారు. కుంతి, ద్రౌపది, సీత, సుమిత్రలు కేవలం పురాణేతిహాసాల్లోని పాత్రలు కాదు, మూర్తీభవించిన మహోన్నత మానవతామూర్తులు. అంతులేని త్యాగం, ధైర్యం, స్వాభిమానం, సమయస్ఫూర్తి ప్రదర్శించారు.
అభ్యుదయం అనేది ఆధునిక వస్త్రధారణలో, పటాటోపంలో కాదు.. ఆదర్శప్రాయమైన లక్షణాల్ని పుణికిపుచ్చుకోవడంలో, ఔన్నత్యాన్ని పెంచుకోవడంలో ఉంటుంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటూ, ధైర్యంగా సాగాలి.