
భారతీయ విద్యా వ్యవస్థ ఏకంగా ఐక్యరాజ్య సమితి దృష్టినే ఆకర్షించింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC)61 వ సెషన్ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు మహిళా విద్యార్థులు భారతదేశ సమ్మిళిత మరియు ఆచరణాత్మక విద్యా వ్యవస్థను బహిరంగంగా ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 (NEP) ని కూడా ప్రశంసించారు.
ఆక్స్‌ఫర్డ్ విద్యార్థిని జో బార్క్లే తన ప్రసంగంలో మాట్లాడుతూ భారత్ లోని యువత ఎల్లప్పుడూ ఆశయాలతో ముందుకు సాగుతారని, చాలా కష్టపడతారని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే అంత సులభంగా వారికి అవకాశాలు దొరకవని, ఈ కారణంగానే భారత దేశ విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచిస్తారని, కొత్త కొత్త అవకాశాలను వెతుక్కోవడానికి ప్రేరణా బిందువు అని పేర్కొన్నారు.
అంతేకాకుండా విద్య అంటే కేవలం అకాడమిక్ దృష్టి కోణం మాత్రమే కాదని, వృత్తి నైపుణ్యాలకు సంబంధించి కూడా అని పేర్కొన్నాడు. వడ్రంగి, కుట్టుపని మరియు ఇతర సాంకేతిక ఉద్యోగాలను వైట్ కాలర్ ఉద్యోగాల మాదిరిగానే గౌరవించాలని ఆయన వాదించాడు. భారత్ లో వృత్తిపరంగా విద్య కూడా వుందని, ముఖ్యంగా యునైటెడ్ కింగ్‌డమ్, ఈ సమతుల్య నమూనాను చూసి నేర్చుకోవాలని కూడా సలహా ఇచ్చాడు.
భారతదేశ విద్యావ్యవస్థ మహాత్మా గాంధీ ఆలోచనల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని, విద్య అంటే కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక బాధ్యతను కూడా పెంపొందించాలని సూచించాడు. ఈ వ్యవస్థ భారత్ లో వుందన్నారు.
అలాగే అసోం కేంద్రంగా విద్యారంగంలో పనిచేస్తున్న అక్షర్ ఫౌండేషన్ పనిని కూడా ఈ ఇద్దరు ఆక్స్ ఫర్డ్ విద్యార్థులు తెగ మెచ్చుకున్నారు. ఈ సంస్థ జాతీయ విద్యా విధానం 2020 లోని కొన్ని సూత్రాలను అమలు చేస్తోందని, పీర్ లెర్నింగ్, మెంటర్‌షిప్ లాంటివి కూడా వున్నాయన్నారు.ఈ నమూనాలో పెద్ద తరగతి విద్యార్థులు, చిన్న తరగతి వారికి బోధన చేస్తారని, ఇది చదువులో సహాయపడటమే కాకుండా విద్యార్థులకు మంచి కమ్యూనికేషన్ కూడా పెరుగుతుందని, నాయకత్వ, నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఇలాంటి ఓ నమూనాతో ఉపాధ్యాయులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని, విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని ఆ ఇద్దరు స్కాలర్స్ పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ మరియు టెక్నాలజీ నైపుణ్యాలను విద్యలో చేర్చడం భవిష్యత్ కెరీర్‌లకు చాలా కీలకమని ఆక్స్‌ఫర్డ్ వైద్య విద్యార్థిని పెట్రినా లాండర్ అన్నారు.అస్సాంలో అక్షర్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు, సమగ్ర విద్య బలహీన మరియు పేద పిల్లల జీవితాలను ఎలా మారుస్తుందో తాను చూశానని ఆయన అన్నారు.





