
ఉగ్ర సంస్థలతో సంబంధమున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అధికారులు అరెస్ట్ చేశారు. పాక్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థల హ్యాండ్లర్‌లతో మహారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అయాన్ షేక్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లలో వారు పంపుతున్న ఉగ్ర సమాచారాన్ని అతడు సోషల్‌మీడియాలో ఇతర విద్యార్థులకు షేర్ చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకొని.. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామన్నారు.
అయాన్ షేక్‌కు ఉగ్ర హ్యాండ్లర్‌లతో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఉగ్ర సంస్థ ‘జైషే మహమ్మద్’ చీఫ్ మసూద్ అజార్ ప్రసంగాలకు సంబంధించిన పలు వీడియోలు అతడి మొబైల్ ఫోన్‌లో ఉన్నాయన్నారు. ఈ వీడియోల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడానికి, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ప్రయత్నించినట్లు తేలిందన్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన ఎన్‌క్రిప్టెడ్ టెలిగ్రామ్ గ్రూపులలో ఇతర విద్యార్థులను చేర్చుతున్నాడన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.





