
వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల ఆధారితంగా, ప్రపంచదేశాలతో పోటీపడే విధంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యవసాయ రంగం నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతులు కలిపి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని వైవిధ్యంతో కూడిన వాతావరణ పరిస్థితులను రైతులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. బడ్జెట్ తర్వాత నిర్వహించిన మూడో వెబినార్‌లో ‘వ్యవహాయం, గ్రామీణ పరివర్తన’ అనే అంశంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల ప్రమాణాలను, నాణ్యతను, బ్రాండింగ్‌ను ప్రోత్సహించాలన్నారు. ఎగుమతులే లక్ష్యంగా సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. పంటల వైవిధ్యీకరణపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టేలా రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు.
ఆ పంటలపై స్పెషల్ ఫోకస్
2026-27 బడ్జెట్లో జీడిపప్పు, కోకో, శ్రీగంధం లాంటి అధిక విలువ కలిగిన వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించనట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. వంట నూనెలు, పప్పు ధాన్యాలపై ఒక జాతీయ మిషన్, అలాగే ప్రకృతి వ్యవసాయంపై మరో జాతీయ మిషన్ ఏర్పాటు వంటివి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయని ఆయన అన్నారు. “మనం అధిక విలువ కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను పెంచినప్పుడే, మన దేశ వ్యవసాయ రంగాన్ని ప్రపంచస్థాయిలో పోటీకి సిద్ధంగా మార్చగలం ” అని మోదీ స్పష్టం చేశారు.
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి
ప్రస్తుత ప్రపంచం ఆరోగ్యం పట్లల మరింత స్పృహతో ఉందని మోదీ అన్నారు. అందుకే సంపూర్ణ ఆరోగ్యం కోసం సేంద్రియ ఆహారంపై ప్రజలు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. “మనం రసాయన రహిత, ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఈ ప్రకృతి వ్యవసాయమే మన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరువ అయ్యేలా ఒక రహదారిని నిర్మిస్తుంది” అని మోదీ అన్నారు. భారత సుదీర్ఘ అభివృద్ధి ప్రయాణంలో వ్యవసాయం ఒక వ్యూహాత్మక మూలస్తంభమని ఆయన నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వం నిరంతరం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దాదాపు 10 కోట్ల మంది రైతులు రూ.4లక్షల కోట్ల ఎక్కువ మొత్తాన్ని పొందారని మోదీ తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ వ్యవసాయ, గ్రామీణ పరివర్తనకు మరింత ప్రోత్సహాన్ని ఇస్తుందన్నారు.





