ఆడవారంటే కేవలం వంటింటికే పరిమితం కాదని మరోసారి నిరూపించారు ఈ మహిళలు. వారి భర్తలు మరణించినా వాళ్లలో ధైర్యం మాత్రం చనిపోలేదు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల లగేజీని వారి భుజాలపై మోస్తూ తమ కుటుంబ భారాన్ని తగ్గిస్తున్నారు. ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొంటూనే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు పంజాబ్‌కు చెందిన నలుగురు మహిళలు. మహిళా దినోత్సవం వేళ కూలీలుగా జీవనం గడపడం వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తూ!
లూథియానా రైల్వే స్టేషన్‌లో మాయ, సుష్మ, నిషా, లాజా అనే నలుగురు మహిళలు కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరి జీవిత గాథలు ఒక్కోవిధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నిషా రాణి గత ఏడాదిన్నరగా రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారంతా చిన్నవాళ్లే. దురదృష్టవశాత్తు 2024లో ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆదాయం లేక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఏమి చేయాలో తోచక భర్త స్థానంలో తానే కూలీగా పనులు చేయడం ప్రారంభించారు.
50 ఏళ్ల వయసులోనూ
అదేవిధంగా, మరో మహిళ మాయ తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి వివరించారు. “2012 నుంచి కూలీగా పనిచేస్తున్నా. భర్త మరణించిన తర్వాత నా పిల్లల బాధ్యత నాపై పడింది. ఇప్పుడు నా వయసు 50 ఏళ్లు. పని చేయడం శారీరకంగా కష్టతరమే, కానీ కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది. కానీ మా వంటి మహిళల కోసం ప్రత్యేక ప్రతిపాదనలు రావడం లేదు. ఎప్పటికైనా ఎవరైనా మా గురించి ఆలోచిస్తారేమోనని ఆశిస్తున్నాం” అని మాయ వాపోయారు.
భర్త చనిపోయిన తర్వాత రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని మరో మహిళ కూలీ సుష్మా పేర్కొన్నారు. ఇప్పుడు తన వయసు 44 సంవత్సరాలని, తన భర్త కూడా ఇదివరకు స్టేషన్లోనే పనిచేసేవారని పేర్కొన్నారు. ‘కొందరు మమ్మల్ని బలహీనంగా భావిస్తారు. కానీ ఒక మహిళ ఎంత శక్తిమంతురాలో తనకే తెలుస్తుంది. సమాజంలో ఇలాంటి పనులు చేయడం మమ్మల్ని మరింత బలంగా చేస్తోంది’ అని సుష్మా చెప్పారు.
ఇదిలా ఉండగా, స్టేషన్‌లో 15 ఏళ్లుగా పనిచేస్తున్న నరేశ్ కుమార్ అనే కూలీ నలుగురి మహిళల గురించి వివరించారు. “వారంతా స్టేషన్‌లో ఎంతో కష్టపడి, నిజాయతీగా పనిచేస్తున్నారు. మేమంతా ఆ మహిళలకు వీలైనంత సహాయం చేస్తుంటాం. వారి భర్తలనూ కోల్పోయిన తర్వాత ఈ పనిని ప్రారంభించారు. ఇప్పుడు వారు చేసే పని సమాజంలో ఉన్న ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది” అని చెప్పుకొచ్చారు.





