
ఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడాన్ని భారత్ ఖండించింది. పవిత్ర రంజాన్ మాసం వేళ ఈ దాడులు జరపడం, ఇందులో మహిళలు, చిన్నారుల సహా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఇది తమ అంతర్గత వైఫల్యాలను ఇతరులపై రుద్దేందుకు పాక్ చేసిన ప్రయత్నమేనని స్పష్టం చేసింది. అఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి ఎప్పుడూ మద్దతిస్తామని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేశామని, ఇటీవల తమ దేశంలో జరిగిన దాడులకు వీళ్లే కారణమని పాకిస్థాన్ పేర్కొంది. ఇందులో కనీసం 70 మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌద్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఈ వాదనకు సంబంధించి ఎటువంటి ఆధారాలను మాత్రం ఆయన చూపించకపోవడం గమనార్హం.





