
‘లయం’ అంటే విధ్వంసం. తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడో, పెద్దయెత్తున వరదలూ సునామీ లాంటివి ముంచెత్తినప్పుడో సంభవించేది అది. మనుషులతో పాటు, వాళ్లు నిర్మించుకున్న ఆస్తులన్నింటినీ తనలో లయం చేసుకుంటుంది ప్రకృతి. అలా ‘నేను’ అనే అహంభావాన్ని లయం చేస్తూ నిర్వాణానికి సోపానాలు వేసే చోటు ఆలయం. ఇల్లు లేదా నివాసం అని అర్థం వచ్చే ‘ఆలయ’ అనే సంస్కృత పదం దీనికి మూలం. దేవుడి నివాసంగా భావిస్తూ దాన్ని పవిత్రంగా చూసుకుంటాం. ఆలయం అంటే దేవాలయం ఒక్కటే కాదు. ఆరోగ్యకర సంపూర్ణ జీవనానికి దారిచూపే ప్రతి చోటూ ఆలయమే. ముఖ్యంగా ప్రకృతిని వనరుల సమాహారంగానే కాకుండా దైవస్వరూపంగా భావించారు మన పూర్వీకులు. పంచభూతాలకు దైవత్వం ఆపాదించడం వెనక మనిషి మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని కాపాడాలనే గట్టి సంకల్పం దాగిఉంది.
దేవాలయమే కాకుండా మనకి ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. జీవాత్మకు ఆసరా కావాలంటే దేహం అవసరం. ఆ కాయం ఆరోగ్యంగా, బలిష్ఠంగా ఉండాలంటే తగిన ఆహారం సరైన వేళలో తీసుకోవాలి. ఇంట్లో వంటగది కావచ్చు, బయట ఆహారశాల కావచ్చు. అది భోజనాలయం. తినే ఆహారాన్ని పవిత్రంగా, ఇష్టంగా వృథా చేయకుండా తినాలి. కష్టించి ధాన్యం పండించిన రైతులను గుర్తుచేసుకుని కృతజ్ఞత తెలిపే పవిత్రస్థలం కూడా భోజనాలయమే!
విద్యాసముపార్జన జరిగే చోటు విద్యాలయం. గురువుల బోధనలు, పుస్తకాలు కలిసి మనను అజ్ఞానంలోంచి బయటపడేసే ప్రదేశమది. నాట్యవిషయాలు బోధిస్తూ నాట్యంలో తర్ఫీదు ఇచ్చి నిష్ణాతులను చేసే ఆచార్యులు ఉండే చోటు నాట్యాలయం. శారీరక, మానసిక రుగ్మతలకు వైద్యం చేసి స్వస్థత చేకూర్చే ధన్వంతరులు ఉండే స్థలం వైద్యాలయం. సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఏర్పాటైనవి రక్షకభట నిలయాలు. వీటన్నిటి ఆరంభానికి, అనుమతులకు, పర్యవేక్షణ వగైరా అన్ని విషయాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రధాన భూమిక నిర్వహించే ప్రభుత్వ కార్యాలయం కూడా నిజానికి పవిత్రస్థలమే. కానీ, ప్రజోపయోగానికి ఉద్దేశించిన దాని పవిత్రతను ఎంతవరకూ కాపాడుకుంటున్నాం అన్నది ప్రధాన ప్రశ్న!
కాయమే కైలాసం, పనే దైవం అని బసవేశ్వరుడు అన్నాడు. చేసే పనే దైవారాధన అని వివేకానందుడు బోధించాడు. దేవాలయంలో ఎంత భక్తిగా ఉంటూ పూజలు చేస్తారో అంతే నిజాయతీగా, నిబద్ధతతో కార్యాలయంలో ఉద్యోగులు పనిచేయాలి. తమ విధ్యుక్తధర్మంగా చేసిన పనికి ప్రతిఫలం వేతన రూపంలో అందుతుంది. అది కాకుండా అనుచితంగా ఫలితాలు ఆశించడం కూడని పని. ప్రలోభాలకు లొంగకుండా పని చేయడమే కార్యాలయంలో చేసే దైవారాధన. ‘మనసు పవిత్రంగా ఉంటే మన చెంబులోని నీరే గంగ’ అంటాడు సంత్ రవిదాస్. ‘చిత్తం శివుడి మీద భక్తి మరెక్కడో’ అన్నట్లుగా కాకుండా ఎక్కడ ఉంటే అక్కడి పనిని నూటికి నూరుశాతం మనసుపెట్టి, విలువలకు కట్టుబడి, నిజాయతీతో చేయడం మనిషి ధర్మం. అప్పుడు ప్రతి చోటూ దేవాలయమే అవుతుంది, చేస్తున్న పని దైవారాధన అనిపించుకుంటుంది.





