
ఉగ్రపేలుడు కేసులో తవ్వేకొద్దీ కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రడాక్టర్లు అందరూ కలిసి ఏకంగా ‘అన్సార్ ఇంటీరియం’ పేరిట కొత్త టెర్రరిస్టు సంస్థనే ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. వాస్తవానికి ఈ డాక్టర్లు మొత్తం చాలాకాలం క్రితమే ర్యాడికలైజ్ అయ్యారు. అప్పట్లో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
జమ్ముకశ్మీర్ పోలీసులు ఇటీవల ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించగా కొత్త విషయం బయటపడింది. కొంతమంది డాక్టర్లు, రాడికల్ మత ప్రచారకులు కలిసి ‘అన్సార్ ఇంటీరియం’ పేరుతో కొత్త ఉగ్రసంస్థను ఏర్పాటుచేసుకున్నట్టు తేలింది.జమ్ముకశ్మీర్‌లో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడేందుకు దీనిని 2022లో ఏర్పాటుచేసినట్టు పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. ఢిల్లీ ఎర్ర కోట దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ, 2016-18 మధ్య కాలంలో పలు ఉగ్రవాద గ్రూపుల్లో చేరడానికి ప్రయత్నించాడని, అయితే.. డాక్టర్లు, మరికొంత మందితో కలిసి కొత్త సంస్థను శ్రీనగర్‌లో ఏర్పాటుచేసినట్టు పోలీసులు చెప్పారు.
ముజమ్మిల్ గన్నీ, ఉమర్ నబీ, ఆదిల్, ముజఫర్ మౌల్వీ ఇర్ఫాన్, కారీ ఆమిర్ , తౌఫిల్ గాజి కలిసి ఏప్రిల్ 2022లో శ్రీనగర్‌లో సమావేశమయ్యారు. అదే సమయంలో వారు అన్సార్ ఇంటీరియం అనే సంస్థను ప్రారంభించారు. దీనికి ఆదిల్ చీఫ్‌గా నియమితులయ్యారు. మౌల్వీ ఇర్ఫాన్‌కు డిప్యూటీగా బాధ్యతలు అప్పగించారు.
ఎవరెవరు ఏమి చేయాలనేది కూడా ముందే నిర్ణయించుకొని.. బాధ్యతలను పంచుకొన్నట్లు అరెస్టైన ఉగ్ర డాక్టర్లు వెల్లడించారు. వీరు ఆపరేషనల్ కోడ్స్ కూడా సిద్ధం చేసుకొన్నారు. ఉమర్ సమన్వయకర్త బాధ్యతలు తీసుకోగా.. గన్నీ ఫైనాన్స్, కొనుగోళ్లు విభాగాలను చూసేవాడు.
ఈ గ్రూప్ 2023లో పేలుళ్లకు అవసరమైన మెటీరియల్, ఎరువులను సోహ్న నుంచి కొనుగోలు చేసింది. ఇక ఉమర్ సూచనల మేరకు ఫరీదాబాద్‌లోని ఓ కెమికల్ షాప్ నుంచి పొటాషియం నైట్రేట్‌ను తెప్పించారు.
ఇక ఉమర్ ఆన్‌లైన్ వీడియోలు చూసి ఐఈడీలను తయారు చేయడం నేర్చుకొన్నట్లు ఇంటరాగేషన్‌లో తేలింది. ఆదిల్ దక్షిణ కశ్మీర్‌కు చెందిన డానిష్‌ను అల్‌ఫలా విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చి ఉంచాడు. అతనితో ఆత్మాహుతి దాడి చేయించాలని ఉమర్ యోచించాడు. కానీ, చివరి నిమిషంలో వెనక్కి తగ్గాడు.
గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు..డీఎంకే నేతకు మూడేళ్ల జైలు
ఈ ఉగ్రడాక్టర్ల గ్రూపులో ఉమర్ అత్యధికంగా ర్యాడికలైజ్డ్ అయిన వ్యక్తి. దిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో లేదా.. ఏదైన కీలక ప్రార్థనా మందిరం వద్దగానీ అత్యంత శక్తిమంతమైన కారుబాంబును పేల్చాలని కుట్రపన్నినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. శ్రీనగర్ పోలీసులు ఈ సంస్థ గుట్టు రట్టు చేయడంతో.. ఉమర్ ఒక్కసారి తీవ్ర ఆందోళనలకు గురయ్యాడు. దీంతో దిల్లీలో పేలుడుకు పాల్పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇతడు 2016, 2018లో ఉగ్ర సంస్థల్లో చేరేందుకు విఫల యత్నం చేసినట్టు సమాచారం.





