
కర్నాటక కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్లీ మషక్ దర్గా పరిధిలో వున్న శివలింగానికి మహా శివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబురిగి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఈ వివాదం నడుస్తోంది.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పూజలు చేసుకుంటామంటూ పిటిషనర్ సిద్దరామయ్య హిరేమఠ్ తో పాటు హిందూ సంఘాలు, ఆండోలా మఠ్ ప్రతినిధులు కోర్టు మెట్లెక్కారు. 1 దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. అయితే కేవలం పిటిషనర్ సిద్దరామయ్య హిరేమఠ్ మాత్రమే పూజలు చేయాలని,ఇతర భక్తులకు అనుమతులు లేవని కోర్టు షరతు పెట్టింది. నిజానికి 15 మందికి అనుమతి కావాలని పిటిషన్ కోరారు. కానీ పిటిషనర్ ఒక్కరికే అనుమతి లభించింది.
అలాగే పూజల సమయంలో పిటిషనర్ కి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. పూజల సమయంలో శాంతిభద్రతలకు విఘాగం కలిగించే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది.
మరోవైపు ఆండోలా మఠాధిపతి సిద్ధలింగ స్వామీజీ కోర్టు తీర్పుపై స్పందించారు. తాము 15 మంది పూజలు చేసుకోవడానికి అనుమతి కోరామని, అయితే కోర్టు ఒకే వ్యక్తికి అనుమతిని ఇచ్చారన్నారు. ఇది చాలా సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య అని, హిందూ సంఘాలు దర్గా లోపల శివలింగం వుందని, మహా శివరాత్రి పూజ చేసుకుంటామని కోరుతున్నార్నారు. 2020 లో ఇక్కడి శివ లింగాన్ని దుండగులు అపవిత్రం చేశారని, అది మజార్ నిర్మాణంలో భాగమని పేర్కొంటూ దానిపై చాదర్ ఉంచారని ఆరోపించారు.
“2022లో పూజలు పూర్తి చేసిన తర్వాత, ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది సభ్యులు భారీగా రాళ్లు రువ్వారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా, ఎమ్మెల్యే సుభాష్, జిల్లా అధికారులు ఇందులో గాయపడ్డారన్నారు.శివలింగానికి హిందూ భక్తులు పూజలు చేయకుండా నిరోధించడానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.




