News

ఆరోగ్య కేంద్రం… సేవలు అపూర్వం

184views

శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం గడిచిన 50 ఏళ్లుగా చేస్తున్న సేవలు నిరూపమానమని పలువురు కొనియాడారు. ఒక సంస్థ 50 ఏళ్ల నుంచి నిరంతరాయంగా సేవలు అందించడం సామాన్య విషయం కాదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవం కేంద్రం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేంద్రం అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ సిఆర్ ముకుందా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఒకప్పుడు కలంకంగా ఉండే కుష్టి వ్యాధి నివారణకు యువత నడుంబిగిస్తే తద్వారా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో 50 ఏళ్లుగా చేసిన కృషి కారణంగా వ్యాధి తగ్గుముఖం పట్టడం అభినందనీయమన్నారు, డ్రగ్స్ వలన ఒక తరం నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు సమాజంలో రుగ్మతల నివారణకు యువత కృషి చేయాలన్నారు. ఆరోగ్య ప్రదాత సూర్యదేవాలయం, 33 కోట్ల దేవతలు కొలువైన గోమాతలతో గోశాల ఇక్కడ ఉండటం శుభపరిణామం అన్నారు.

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ సంస్థతో ఇక్కడి వ్యక్తులతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాధి తగ్గుముఖం కోసం విశేషంగా సేవలు అందిస్తూనే సనాతన ధర్మం కోసం అనువైన కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు. ఈ కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తూ 50 ఏళ్ల ప్రస్థానానికి చేరుకోవడం అభినందనీయమని అన్నారు.

రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ హిందూ ఐక్యత కోసం కృషి చేస్తూనే అనేక సేవా కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ ఆదర్శంగా ఉంటుందని ప్రశంసించారు కుష్టు రోగుల కోసం ఏర్పాటైన శ్రీ వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం గడచిన 50 ఏళ్ల కుష్టు రోగం నివారణకు చేసిన ప్రయత్నాల్ని ఆయన కొనియాడారు.

పరమేశ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆనంద్ స్వరూప్ అధవాని మాట్లాడుతూ ఈ కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అద్వితీయం అన్నారు ప్రతి ఒక్కరూ తమకు చేతనేనంత ఏదో ఒక రూపంలో ఇక్కడ సేవలు అందించాలన్నారు.

శ్రీ ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పేదల వైద్యం కొరకు సేవలందిస్తున్న శ్రీ వివేకానంద చారిటబుల్ క్లినిక్ 20 పడకల హాస్పటల్ గా రూపాంతరం చెందుతుందని అనేకమైన వ్యాధులు నయం చేయుట కొరకు తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించాలని సంకల్పంతో పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని మరియు గ్రామంలోని పేదలు పెళ్లిళ్లు వంటివి చేసుకోవడానికి వీలుగా ఒక సామాజిక భవనం నిర్మించాలని భావిస్తున్నామని అలాగే ఔషధ మొక్కలు కూడా పెంచే ఆలోచన ఉందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సహ సంఘ చాలక మాన్య సుంకవల్లి రామకృష్ణ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయ ఆదిత్య విభాగ్ సంఘచా రామచంద్రరాజు ,కేంద్రం నిర్వాహణ సమితి సభ్యులు కేంద్రం యొక్క హితైసులు దాతలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.