
కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజులు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఉమ్మడి కృష్ణా నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటారు. 28వ తేదీ రాత్రి అమ్మవారు మెట్టినింటి నుంచి బయలుదేరి 29వ తేదీ రాత్రికి ఉత్సవ ఆలయాన్ని చేరుకుంటుంది. పట్టణంలోనే కాకుండా పొరుగు గ్రామాల్లోని ఇళ్లు.. తిరునాళ్లకు వచ్చే బంధుమిత్రులు, స్నేహితులతో సందడిగా ఉంటాయి.
పోలీసు శాఖ సంప్రదాయం : వేడుకల ప్రారంభం
రోజు అమ్మవారికి పోలీసు శాఖ ప్రథమ పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం. ఉయ్యూరు పట్టణ పోలీసు స్టేషన్ అధికారి దంపతులు వాటికి స్టేషన్లో పూజలుఅధికారి దంపతులు వాటికి స్టేషన్లో పూజలు నిర్వహించి అనంతరం డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పిస్తారు. ఆతర్వాత అమ్మవారు మెట్టినింటి నుంచి ఉత్సవ ఆలయానికి చేరుతుంది. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ప్రాంగణంలో పోలీసు ఔటోపోస్టు ఏర్పాటు చేస్తారు.
గండదీపాల మొక్కులు..: వీరమ్మతల్లి మెట్టినింటి నుంచి బయలుదేరే సమయం నుంచి ఉత్సవ ఆలయ ప్రవేశం వరకు వేలాది మంది భక్తులు గండదీపాల మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారు బయలుదేరిన సమయంలో ఎదురుగండ దీపాలు, రెండో రోజు వరకు అమ్మవారితో గ్రామోత్సవంలో పాల్గొనే వారు తిరుగుడు గండదీపాల మొక్కులు తీరుస్తారు. అమ్మవారు రెండో రోజు ఉత్సవ ఆలయ ప్రవేశానికి ముందు ఊయల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. లక్ష మంది వరకు ఈ కార్యక్రమాని హాజరవుతారు.
ఫిబ్రవరి 7వ తేదీన సిడిబండి ఉత్సవం…: తిరునాళ్ల 11వ రోజు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ‘సిడిబండి’ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. శివాలయం రోడ్డులోని పాత ట్యాంకు వద్ద సిడిబండి తయారు చేసి దానిని ఊరేగింపుగా ఉత్సవ ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. అక్కడ పట్టణంలోని ఎస్సీవాడకు చెందిన త్వరలో పెళ్లికాబోయే యువకుడిని సిడిబండి గంపలో కూర్చోపెట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు ఆ సమయంలో ఆ యువకుడిని అరటి కాయలతో కొట్టడం సంప్రదాయం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్ష మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు.




