
అజ్మీర్ షరీఫ్ దర్గాకు వ్యతిరేకంగా హిందూ సంస్థ మహారాణా ప్రతాప్ సేన (MPS) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 2024లో హిందూ సేన పిటిషన్ దాఖలు చేసింది. దర్గా ఉన్న స్థలంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని పిటిషన్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు పిటిషన్లను స్థానిక కోర్టు స్వీకరించింది. తమ వాదనలకు మద్దతుగా మ్యాపులు, ఫోటోలు, ఇతర ఆధారాలను కోర్టులో సమర్పిస్తామని ఎంపీఎస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ పర్మార్ చెప్పారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 21న కోర్టు విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పురావస్తు సర్వే(ఏఎస్ఐ), దర్గా కమిటి స్పందనలను కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎంపీఎస్ సభ్యులు దేశవ్యాప్తంగా 7800 కి.మీ యాత్ర చేపట్టారని, దర్గా కింద ఆలయం ఉందనే వాదనకు మద్దతుగా ఇచ్చే వందలాది మంది ప్రజల నుంచి అఫిడవిట్లు సేకరించారని సంస్థ పేర్కొంది. గతంలో హిందూ సేన దాఖలు చేసిన దావాలో కోర్టులో వారి వాదనకు మద్దతుగా చరిత్రకారుల పుస్తకాలను సమర్పించారు.





