
జగ్గన్నతోట ప్రభల తీర్థం ప్రారంభమైంది. మొత్తం 11 గ్రామాల్లో భాగంగా.. పాలగుమ్మిలో మొదటి ప్రభ ప్రారంభమైంది. ప్రభల ఊరేగింపు అనంతరం ప్రభలు జగ్గన్న తోట చేరుకోనున్నాయి. ఈసారి తీర్థంలో 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా.
ప్రభల ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వాటిలో కొత్తపేట, జగ్గన్నతోటలో జరిగే ప్రభల ఉత్సవాలు ముఖ్యమైనవి. వీటితో పాటు చిరుతపూడి (అవిడి డ్యామ్ సెంటర్), మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన మండలం చెయ్యేరులలో అతి పెద్ద ప్రభల తీర్థాలు నిర్వహిస్తారు.
అంబాజీపేట మండలం మొసలపల్లి – ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థాలు జరుగుతాయి. వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వరుడు, కె.పెదపూడి – మేనకేశ్వరుడు, ఇరుసుమండ – ఆనంద రామేశ్వరుడు, వక్కలంక – విశ్వేశ్వరుడు, నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి. ముక్కామల – రాఘవేశ్వరుడు, మొసలపల్లి –భోగేశ్వరుడు, పాలగుమ్మి – చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు అగ్రహారం – వీరేశ్వరుడు, గంగలకుర్రు – చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరుడి ప్రభలు ప్రసిద్ధి చెందాయి.
కొత్తపేట ప్రభల తీర్థం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. ఆయా వీధులకు చెందిన 11 ప్రభలు వివిధ దేవతా మూర్తులను అలంకరించుకుంటాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, రాత్రి బస్టాండ్ వద్ద బాణసంచా కాల్పులు నిర్వహిస్తారు. పాత రామాలయం వీధి పరిధిలోని బోడిపాలెం వీధి వారు కొన్నేళ్లుగా మూడో వీధిగా అరంగేట్రం చేసి, సాయంత్రం పైరెండు వీధులతో పాటు బాణసంచా కాల్చుతున్నారు.





