News

యాగంటి ఆలయ అభివృద్ధికి చర్యలు

228views

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవాలయంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. సచివాలయంలోని 2 వ బ్లాక్ లో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మంత్రి సమావేశమయ్యారు.

బనగానపల్లె నియోజకవర్గంలోని గొప్ప శైవ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాగంటిఆలయానికి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులకు అన్ని విధాలు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకతపై మంత్రులు ఇరువు చర్చించారు. ఈ సందర్భంగా యాగంటి ఆలయంకు వచ్చే భక్తులకు వసతి సదుపాయం కల్పించేందుకు వసతి భవనాలు నిర్మించాలని ఆనం రామానారాయణ రెడ్డి దృష్టికి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీసుకొచ్చారు.. అలాగే ఏడాదికి దాదాపు 5 లక్షల వరకు లడ్డూ ప్రసాదం భక్తులు తీసుకెళ్తున్న క్రమంలో లడ్డూ పోటు భవనం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే దేవాలయంలో దాదాపు 208 మెట్లు ఉన్న క్రమంలో వృద్ధులు, వికలాంగులు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో వారికి అనుకూలంగా ఉండేలా ర్యాంప్, లిప్ట్ వంటివి ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అలాగే ఆలయంకు పర్వదినాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే క్రమంలో క్యూలైన్లు, భక్తుల కోసం అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను దేవాదాయ శాఖ మంత్రికి వివరించడం జరిగింది.

గతేడాది డిసెంబర్ నాటికి యాగంటి ఆలయంలో స్వామి వారి నిధులు రూ. 3.90 కోట్లు ఉండగా, అందులో రూ. 1.5 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయగా, ఇంకా దాదాపు 2.50 కోట్ల నిధులు అందుబాటులో ఉన్న క్రమంలో ఆ నిధులును ఆలయ మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణరెడ్డిని, ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కోరారు.. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఆనం రామానారాయణరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి అందుకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

యాగంటి ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న క్రమంలో ఆలయ అభివృద్ధికి తలెత్తుతున్న సమస్యలను సైతం ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీసుకొచ్చారు. ముఖ్యంగా పురావస్తు శాఖ కఠిన నిబంధనలు ఆలయ అభివృద్ధికి నిరోధకంగా మారుతున్నాయని తెలియజేశారు. ముఖ్యంగా దేవాలయంలో నీరు లీకేజీ అవుతున్నప్పటికీ, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండటం ద్వారా వాటిని నియంత్రించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ అంశాలపై స్పందించిన మంత్రి ఆనం రామానారాయణరెడ్డి.. పురావస్తు శాఖ ప్రాచీన ఆలయాలను కాపాడటంతో పాటు, అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు