
శబరిమల బంగారం తాపడాల కేసులో సోమవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడినీ వదిలిపెట్టలేదంటూ ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్ పిటిషన్‌ను కొట్టివేసింది. కనీసం దేవుడు, ఆలయం జోలికివెళ్లకుండా ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో శంకర్‌దాస్ కూడా బాధ్యులేనని పేర్కొంది.
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం అదృశ్యం వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. 2019లో బంగారం పూత పూసిన రాగి రేకులను ఎలక్ట్రో ప్లేటింగ్ (విద్యుత్ సాయంతో బంగారు పూత పూయడం) కోసం స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు అప్పగించారని కేరళ హైకోర్టుకు సిట్ వెల్లడించింది. ఆ ప్లేట్ల మొత్తం బరువు 42.100 కేజీలు కాగా ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి దానిని ప్రైవేటుగా మళ్లించాడని ఆరోపించింది. ఎలక్ట్రోప్లేటింగ్ అనంతరం ఉన్నికృష్ణన్ తనకు 474.90 గ్రాముల బంగారం ఇచ్చాడని గోవర్ధన్ అనే మరో నిందితుడు తెలియజేసి ఆమేరకు సిట్‌కు ఇప్పటికే బంగారం అప్పగించాడు.
ఈ కేసు విచారణలో భాగంగా గతంలో బోర్డు మాజీ సభ్యుడు శంకర్‌దాస్‌పై కేరళ హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. నేరపూరిత కుట్ర ఆరోపణల నుంచి తప్పించుకోలేరని మండిపడింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న తీవ్ర వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ తాజాగా అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఇక ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేయడానికి సిట్‌కు కేరళ హైకోర్టు మరో ఆరువారాల గడువు ఇచ్చింది. జనవరి 19న ప్రత్యేక దర్యాప్తు బృందం మధ్యంతర నివేదికను న్యాయస్థానానికి సమర్పించనుంది.





