News

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన యూకే

222views

బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా కొనసాగుతోన్న దాడులపై యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలైన దీపూ చంద్రదాస్‌, అమృత్‌ మండల్‌, బజేంద్ర బిశ్వాస్‌ల హత్యలను ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీపూ హత్య కేసులో బంగ్లాదేశ్‌ పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేయడాన్ని.. ఆ దేశంలో అన్నివర్గాల భద్రతకు ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ప్రజల మత స్వేచ్ఛ, విశ్వాసాలను కాపాడటానికి యూకే ప్రభుత్వం కట్టుబడి ఉందని కీర్‌ స్టార్మర్‌ పేర్కొన్నారు. నవంబర్‌లో తమ మంత్రి జెన్నీ చాప్‌మన్.. యూనస్‌ను కలిసిన సమయంలో కూడా బంగ్లాలో మైనారిటీల రక్షణ అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపారు. పౌర, మానవ హక్కులను రక్షించడంలో.. అవినీతిని ఎదుర్కోవడంలో బంగ్లాదేశ్‌కు బ్రిటన్ మద్దతు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.

బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న అల్లర్ల వేళ ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో ఇటీవల 25 ఏళ్ల దీపూ చంద్రదాస్‌ అనే హందూ వ్యక్తిపై అల్లరిమూకలు దాడి చేసి, హత్య చేశాయి . మరో ఘటనలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో అమృత్‌ మండల్‌ అనే మైనారిటీ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపారు. మంగళవారం బజేంద్ర బిశ్వాస్‌ అనే మరో హిందువుని అతడి సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు. హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.