
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ వందేళ్ల కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ దుర్గాపురం బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు శ్రీ లలితా పీఠం పూజనీయ శ్రీశ్రీశ్రీ ఆదిత్యానంద భారతీ స్వామీజీ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఈ సనాతన ధర్మం ప్రతి రూపమే హిందూ సమ్మేళనం అన్నారు. సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు.

ప్రధాన వక్తగా వివేకానంద కేంద్ర కన్యాకుమారి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల సంపర్క ప్రముఖ్ సి.వి. సదాశివ గారు మాట్లాడుతూ, సమర్థ భారత నిర్మాణం కోసం కలిసి నడవాలని పేర్కొన్నారు. హిందువులంతా సంఘటితమై హైందవ ధర్మాన్ని పరిరక్షించుకొని భారత్‌ను విశ్వగురువుగా నిలపాలని చెప్పారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న అడ్వకేట్ అల్లూరి సతీష్ గారు మాట్లాడుతూ,ఆర్ఎస్ఎస్ 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు వందేళ్లుగా దేశం కోసం, ధర్మం కోసం సేవ చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. వందేళ్ల ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ లక్షలాది మంది దేశం కోసం పాటుపడే పౌరులను దేశానికి అందించిందన్నారు. నేటి బాలలకు వ్యక్తిత్వ వికాసం నేర్పుతూ దేశ నిర్మాణానికి ఉపయోగపడాలనే ఆర్ఎస్ఎస్ ఆశయాన్ని ఆ సంస్థ నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే ఈ కార్యక్రమంలో వి.హెచ్.పి. మహానగర్ ఉపాధ్యక్షురాలు డా॥ టి.డి.వి. లక్ష్మీ కుమారి గారు, గౌతమ్ ఎడ్యుకేషనల్ సంస్థల చైర్మన్ శ్రీ పాండ్రంకి చంద్రశేఖర్ గారు, శ్రీ నవనీతం సాంబశివరావు గారు, శ్రీమతి గుండిమెడ సీతారావమ్మగారు తదితరులు పాల్గొన్నారు.





