
బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులు సహా పలువురి మీద జరుగుతున్న దాడులపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. విప్లవవాద నాయకుడు షరీఫ్ ఒస్మాన్ హడీ హత్యను నిరసిస్తూ అతని మద్దతుదారులు ఢాకాలోని కీలక కూడలిని దిగ్బంధం చేశారు. న్యాయం చేయాలని నినదిస్తూ బైఠాయించడంతో ట్రాఫిక్ గంటలతరబడి నిలిచిపోయింది. ఢాకా విశ్వవిద్యాలయ మసీదు నుంచి షాబాగ్ వరకు ప్రదర్శన చేపట్టి ధర్నా నిర్వహించారు. న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. హడీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లు, విధ్వంసకాండలో హిందూ కార్మికుడు దీపూ చంద్రదాస్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు.. బ్రిటన్‌లోని ప్రవాసం వీడి 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రహ్మాన్ తన తండ్రి, బంగ్లా మాజీ అధ్యక్షుడు జియాఉర్ రహ్మాన్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. 19 ఏళ్ల తర్వాత ఈ సమాధి వద్దకు రాగలగడంపై ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
బంగ్లా, పాక్‌లలో బాబర్‌లు ఇంకా ఉన్నారు
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల్ని కేంద్ర మాజీమంత్రి మీనాక్షీ లేఖి ఖండించారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో ఇంకా కొందరు నేతలు మొగల్ చక్రవర్తి బాబర్ మాదిరి ఆలోచనాధోరణితో ఉన్నారని విమర్శించారు. అందుకే ఆ రెండు దేశాల్లో హత్యలు జరుగుతున్నాయన్నారు. భారత్‌ను రెచ్చగొట్టాలనేదే వారి ఉద్దేశమని ఆరోపించారు. దండెత్తి వచ్చేవారిపై సహృదయత చూపాల్సిన అవసరం లేదన్నారు.
5 లక్షల మంది సన్యాసులతో హైకమిషన్‌ను ముట్టడిస్తా
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్ని భారత్ ఖండించింది. కిరాతకమైన దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారకులైన దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేసింది. తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక దాదాపు 2,900 హింసాత్మక ఘటనలు మైనారిటీలపై జరిగాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వీటిని రాజకీయ హింసగా కొట్టిపారేయలేమంది. పశ్చిమబెంగాల్ శాసనసభ విపక్షనేత సువేందు అధికారి కోల్‌కతాలో బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయంలో సీనియర్ అధికారులను కలిశారు. హిందూ మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఐదులక్షల మంది సన్యాసులతో వచ్చి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లోని రెండుకోట్ల మంది హిందువుల్ని పదేపదే లక్ష్యంగా చేసుకుంటుంటే భారత్‌లోని వందకోట్ల మంది హిందువులు మౌన ప్రేక్షకులుగా కూర్చొంటారా అని ప్రశ్నించారు.





