
భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహహ్మద్ యూనస్ చర్యలు తీసుకుంటున్నారని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను.. రాజకీయ వ్యాఖ్యల నుంచి వేరు చేసి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటాం. ఇందుకోసం యూనస్ కృషి చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారు. అయితే భారతీయ వర్గాలతో మాత్రం ఇప్పటివరకు నేరుగా ఆయన మాట్లాడలేదు. బంగ్లాదేశ్ వాణిజ్య విధానం రాజకీయ అంశాల ఆధారంగా ఉండదు. వియత్నాం లేదా ఇతర దేశాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం కంటే భారత్ నుంచి తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయడం ఆర్థికంగా సరైన నిర్ణయం. దిల్లీతో సత్సంబంధాలను మేం కోరుకుంటున్నాం. అందుకే భారత్ నుంచి 50 వేల టన్నుల బియ్యం కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించాం’’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమ సంబంధాలను దెబ్బతీసేందుకు బాహ్యశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
దీపూచంద్ర కుటుంబానికి అండగా ఉంటామని హామీ
బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందూ యువకుడు దీపూచంద్ర దాస్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వంలో విద్యారంగ సలహాదారుగా ఉన్న సి.ఆర్.అబ్రార్.. మొహమ్మద్ యూనస్‌తో భేటీ అనంతరం మంగళవారం దీపూచంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన తల్లిదండ్రులు, భార్యాబిడ్డల సంక్షేమ బాధ్యతలను సర్కారు చూసుకుంటుందని హామీ ఇచ్చారు. దీపూచంద్ర హత్య క్రూరమైన నేరమని, అది ఎంతమాత్రమూ క్షమార్హం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హాదీ హత్య వెనుక యూనస్ సర్కారులోని కీలక వ్యక్తులు?
బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉందని ఆయన సోదరుడు ఒమర్ హాదీ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలను అస్థిరపర్చేందుకే ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. హత్యల కారణంగా ఎన్నికల వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒమర్ కోరారు. వేగంగా దర్యాప్తు జరిపి హాదీ హత్య కేసు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మాన్ హాదీకి న్యాయం జరగకపోతే, ఏదో ఒకరోజు యూనస్ కూడా బంగ్లాదేశ్‌ను వీడి పారిపోవాల్సి వస్తుందని ఒమర్ హాదీ హెచ్చరించినట్టు స్థానిక మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి.
అవామీ లీగ్‌పై నిషేధం పట్ల అమెరికా చట్టసభ్యుల ఆందోళన
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉండటంపై అమెరికాకు చెందిన పలువురు చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి కూడా అవకాశం కల్పించాలని యూనస్ సర్కారుకు ఓ లేఖలో తాజాగా సూచించారు. పారదర్శక రీతిలో, స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ ప్రజలకు ఉండాలని అభిప్రాయపడ్డారు.





