ArticlesNews

రోహింగ్యాలకు ఎర్ర తివాచీ పరవాలా?

187views

ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లును ప్రోత్సహించేవారికి చెంపపెట్టులా తగిలాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలకాలా?..అసాధారణ రక్షణలు కల్పించాలా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది ధర్మాసనం. ఇప్పటికే ఇక్కడ తిష్టవేసినవారిని ఎందుకు బయటకు పంపించకూడదు? అని ప్రశ్నించింది. దేశంలో ఉండడానికి చట్టపరమైన అనుమతి లేనివారంతా చొరబాటుదారులే నని తేల్చిచెప్పింది. మన సొంత పౌరులు పేదరికంలో మగ్గిపోతున్నారని, పరాయి వ్యక్తులను భరించలేమని పరోక్షంగా స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రొహింగ్యాల గురించే.

మానవ హక్కుల కార్యకర్త రీటా మన్‌చందా దాఖలు చేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ‌జోయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం డిసెంబర్‌ 1‌వ తేదీన విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలో కొందరు రొహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తర్వాత వారి జాడ తెలియడం లేదని పిటిషనర్‌ ‌ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఆచూకీ బయటపెట్టేలా పోలీ సులను ఆదేశించాలని కోరారు. ఒకవేళ రొహింగ్యా లను వెనక్కి పంపించాలనుకుంటే చట్టప్రకారం నడుచుకోవాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును వారు ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందించింది

చొరబాటుదార్లు సరిహద్దును దాటేసి మన దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారని ధర్మాసనం గుర్తు చేసింది. సొరంగం తవ్వుకొని, కంచెను ఛేదించి అక్రమంగా అడుగుపెడుతున్నారు. భారతదేశంలోకి వచ్చారు కాబట్టి వారిని ఇక్కడి పౌరులుగా గుర్తించా లని, స్థానిక చట్టాలను వర్తింపజేయాలని కొందరు వాదిస్తున్నారు. ఆహారం, నివాసం, విద్య వంటి వసతులు కల్పించాలని అంటున్నారు. నిజంగా చొరబాటుదార్లకు రెడ్‌కార్పెట్‌ ‌స్వాగతం పలకాలా? వారికి అన్ని రకాల వసతులు కల్పించాలా? ఇదెక్కడి చోద్యం? అని ప్రశ్నించింది.

చొరబాటుదార్లను పక్కనపెట్టి మన దేశంలో పేదల బతుకులను బాగు చేయడంపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్‌ ‌దాఖలు చేసే అర్హత రీటా మన్‌చందాకు లేదని, పోలీసుల అదుపులో ఉన్న రొహింగ్యాలెవరూ కోర్టును ఆశ్రయించలేదని పేర్కొన్నారు.

రొహింగ్యాలకు సంబంధించి వచ్చిన పిటిషన్లను 3 భాగాలుగా విభజించి ఆ తర్వాత విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ విషయంలో స్పష్టత వస్తే తదుపరి చర్యలు చేపట్టవచ్చని సూచించింది. రొహింగ్యాలను శరణార్థులుగా గుర్తిస్తే వారికి ఎలాంటి రక్షణలు, ప్రయోజనాలు, హక్కులు కల్పించాలన్నది పరిగణనలోకి తీసుకోవచ్చని తెలియజేసింది. జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా, జస్టిస్‌ ‌కోటిశ్వర్‌ ‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

భారత్‌లో ఉన్న రొహింగ్యా శరణార్థులు విదేశీయులని తేలితే భారత చట్టం ప్రకారం తిరిగి పంపించాలని పేర్కొంది. ఒకవేళ అక్రమ వలస దారులే అయితే వారిని వెనక్కి పంపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని వివరించింది. యూఎన్‌హెచ్‌సీఆర్‌ ‌జారీ చేసిన ఐడీ కార్డులు కూడా వాళ్లకి ఏ విధంగా కూడా సహాయ పడకపోవచ్చని చెప్పింది. మరోవైపు దేశంలో 12 రాష్ట్రాల్లో రొహింగ్యాలు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వివరించాయి. ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ‌తెలంగాణ, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రొహింగ్యాలు ఉంటున్నట్లు పేర్కొన్నాయి. కానీ ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.

మనకేల ఈ తలనొప్పి?
రొహింగ్యాల తలనొప్పి భారత్‌కి 2012 నుంచి మొదలైంది. వాస్తవానికి ఇది భారతదేశానికి ఎలాంటి సంబంధం లేని సమస్య. మన దేశంతో రొహింగ్యాలకు ఎలాంటి సంబంధం లేదు. బాంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌ల మధ్య నలుగుతున్న సమస్య ఇది. ప్రపంచంలో నేడు ఇస్లాం రెండవ పెద్ద మతం. ప్రపంచంలోని 193 దేశాలలో ముస్లిం మెజారిటీ దేశాలు 50 దాకా ఉన్నాయి. ఎవరికీ లేని బాధ ఒక్క భారత్‌కే ఎందుకు? రొహింగ్యాల పోషణ రక్షణ భారాన్ని భుజాల కెత్తుకోవాల్సిన బాధ్యత భారత్‌కే ఎందుకు?

ప్రపంచంలో మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌వంటి సంపన్న ముస్లిం దేశాలున్నాయి. అలాంటప్పుడు రొహింగ్యా ముస్లింలకు ఈ సంపన్న దేశాలలో ఎందుకు ఆశ్రయం లభించడంలేదు? దీన్ని బట్టి రొహింగ్యాలు ఎంత ప్రమాదకారులో అర్థం చేసుకోవచ్చు. మానవతా వాదుల ముసుగులోని కొన్ని సంస్థలు రొహింగ్యాల మీద ఎక్కడ లేని ప్రేమను చూపిస్తూ భారత్‌ ‌వీరికి ఆశ్రయం కల్పించాలని వాదిస్తున్నాయి. నిజంగా రొహింగ్యా ముస్లింలపై శ్రద్ధ ఉన్నట్టయితే వారికి సంపన్న ముస్లిం దేశాల్లో వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలి.

రొహింగ్యాల సమస్య ఏంటి?
బ్రిటిష్‌ ‌వారి కాలంలో మయన్మార్‌( ‌బర్మా) పాలనాపరంగా భారత్‌లో కలిసి ఉండేది. ప్రస్తుత బాంగ్లాదేశ్‌ (‌తూర్పు బెంగాల్‌) ‌ప్రాంతానికి చెందిన బెంగాలీ మాట్లాడే ముస్లింలు బర్మాలోని రఖైన్‌ ‌ప్రాంతంలో పనుల కోసం వలసపోయారు. వీరినే రొహింగ్యా ముస్లింలుని పిలస్తారు. వారి ఉన్మాద, విద్రోహ వైఖరికారణంగా మొదటి నుంచీ వీరిని మయన్మార్‌వాసులు అనుమానంగానే చూశారు. భారత దేశ విభజన సమయంలో రొహింగ్యాలు తమను తూర్పుపాకిస్తాన్‌లో కలపాలని డిమాండ్‌ ‌చేశారు. రొహింగ్యాల కోరిక ఫలించకపోగా. మయన్మార్‌ ‌వీరిని తమ పౌరులుగానే గుర్తించలేదు. వారు బాంగ్లాదేశ్‌ ‌నుండి అక్రమంగా వచ్చిన వలస దారులని ఆ దేశం చెబుతుంది. అయితే క్రమంగా రొహింగ్యాలు బర్మాకు సమస్యగా మారిపోయారు. తమ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆందోళనలు చేపట్టారు. అక్కడ బౌద్దుల మీద దాడులు, అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో మయ న్మార్‌ ‌బౌద్ధులు వీరిపై తిరగబడ్డారు. అక్కడి సైన్యం కూడ కఠినంగా వ్యవహరించడంతో రొహింగ్యాలు మయన్మార్‌ ‌నుంచి వలస పోవడం ప్రారంభించారు. పొరుగు ఉన్న థాయిలాండ్‌, ‌మలేసియాలు వారిని తమ దేశంలోకి రానివ్వలేదు. దీంతో దాదాపు 7 లక్షల మందికి పైగా రొహింగ్యాలు బాంగ్లాదేశ్‌లోకి పారిపోయారు. కానీ బాంగ్లాదేశ్‌ ‌రొహింగ్యాల ప్రవేశాన్ని పరిమితం చేయడంతో వారి దృష్టి భారత్‌ ‌మీద పడింది. పశ్చిమ బెంగాల్‌-‌బాంగ్లాదేశ్‌ ‌సరిహద్దుల గుండా అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించడం మొదలైంది.

కశ్మీర్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌దాకా..
భారత్‌లో దాదాపు 40,000 మంది రోహిం గ్యాలు ఉండొచ్చని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ చొరబాటుదారుల సంఖ్య లక్షల్లోనే ఉంటుం దని అంచనా. వివిధ మార్గాల్లో మన దేశంలోకి ప్రవేశించిన వీరంతా వివిధ రాష్ట్రాలు, నగరాల్లోకి వేగంగా విస్తరించారు. విచిత్రంగా హైదరాబాద్‌ ‌పాతబస్తీ రొహింగ్యాలకు స్థావరంగా మారిపోయింది. బాలాపూర్‌, ‌చాంద్రాయణగుట్ట, కాలాపత్తర్‌, ‌ఫలక్‌ ‌నుమా, బార్కాస్‌, ‌షాహిన్‌ ‌నగర్‌ ‌తదితర ప్రాంతాల్లో అక్రమంగా స్థిరపడ్డారు. పాతబస్తీలో 1200 రొహింగ్యా కుటుంబాలు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ వీరి సంఖ్య వేలలోనే ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, అస్సాం మీదుగా రైలు లేదా బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి వచ్చేశారు. వీరిలో చాలా మంది స్థానికుల్లో కలిసి పోయారు. పైగా రేషన్‌ ‌కార్డులు, ఆధార్‌, ‌పాన్‌ ‌కార్డులు కూడా సంపాదించారు. వీటి ద్వారా పాస్‌పోర్టులు కూడా పొందుతున్నారు. ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు తోడు స్థానికంగా రొహింగ్యా లకు అండగా నిలిచే సంస్థలు కూడా ఉన్నాయి. రొహింగ్యాలు ఓటర్ల జాబితాలో చేరడం ద్వారా ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తున్నారని బయట పడింది. ఇటీవల బిహర్‌, ‌పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌లో రొహింగ్యాల ఓట్లను ఏరివేశారు. గత జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఇలాంటి ఓట్లను గుర్తించారు. స్థానికంగా నేరాల్లో కూడా రొహింగ్యాల ప్రమేయం బయట పడుతోంది. కాగా రొహింగ్యాల్లో అరాచక శక్తులు పెద్ధ సంఖ్యలో ఉన్నారని, ఉగ్రవాదులకు స్లీపర్స్ ‌సెల్స్‌గా కూడా పని చేస్తున్నారని ఇంటెలిజెన్స్ ‌వర్గాలు చెబుతున్నాయి.

శరణార్థులు కాదు చొరబాటుదారులు
దేశంలో అక్రమంగా చొరబడిన వారికి శరణార్థు లకు ఉండే హక్కులు వర్తించవు. రొహింగ్యాలు శరణార్థులు కాదు. కాబట్టి శరణార్థులకు ఉండే హక్కులు వారికి వర్తించవు. శరణార్థుల స్థితిగతులపై 1951నాటి అంతర్జాతీయ తీర్మానంపై భారత్‌ ‌సంతకం చేయలేదు. శరణార్థుల పట్ల అనుస రించాల్సిన విధివిధానాలపై 1967లో కుదిరిన ‘ప్రొటోకాల్‌’‌నూ మన దేశం ఆమోదించలేదు. రొహింగ్యాలవల్ల దేశ భద్రత తీవ్ర ప్రమాదంలో పడుతుందనేందుకు అనేక ఆధారాలున్నాయి. భారతీయ భద్రతా సంస్థలు ఆ మేరకు పూర్తి సాక్ష్యాలు సేకరించాయి. పాకిస్థానీ ఉగ్రసంస్థలతో ప్రత్యక్ష సంబంధాలున్న కొందరు రొహింగ్యాలు సరిహద్దుల ఆవలనుంచి అందుతున్న సంకేతాల ప్రకారమే జమ్ము, ఢిల్లీ, హైదరాబాద్‌ ‌వంటి ప్రాంతాలకు తరలివెళ్లినట్లు భారతీయ భద్రతా విభాగాలవద్ద సమాచారం ఉంది. ఇలాంటివారివల్ల దేశ అంతర్గత భద్రత పెను ప్రమాదంలో పడుతోంది.

ఈ సోకాల్డ్ ‌మానవతావాదులుకు భారత పౌరుల సంక్షేమం కన్నా రొహింగ్యాల బాగోగులే ముఖ్యం. ఉగ్రవాదులతో సంబంధాలున్న రొహింగ్యాలు భారత్‌లో అక్రమంగా స్థిరపడితే జాతి భద్రతకు తూట్లు పడతాయి. వీళ్లకు దేశం పట్టదు, జాతి సంక్షేమం గిట్టదు. అసలైన దేశ పౌరుల సంక్షేమం సంక్షోభంలో పడుతుంది

రాజ్యాంగం ఏం చెబుతోంది
రాజ్యాంగంలోని 14వ అధికరణ, చట్టం ముందు అందరూ సమానులేనని చెబుతోంది. ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి 21వ అధికరణం ప్రస్తా విస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతోపాటు దేశంలో ఏ ప్రాంతానికైనా నిరభ్యంతరంగా వెళ్లేందుకు, నివాసం ఉండేందుకు, స్థిరపడేందుకు రాజ్యాంగంలోని 19వ అధికరణ వీలు కల్పిస్తోంది. అయితే సరిహద్దులు దాటుకుని దేశంలోకి చొరబడిన అక్రమ వలసదారులందరికీ- భారత పౌరులకు వర్తింపజేసే హక్కులు ఉండాలనడం అసమంజసం. అక్రమంగా దేశంలోకి చొచ్చుకు వచ్చిన వారంతా తమకు ఆ హక్కులు వర్తింపజేయాలని వాదించడం అర్థ రహితం. మన రాజ్యాంగం ప్రవచించిన ప్రాథమిక హక్కులు చాలావరకు భారత పౌరులకే వర్తిస్తాయి.

1946 విదేశీయుల చట్టంలోని సెక్షన్‌ 3 ‌కేంద్ర ప్రభుత్వానికి విదేశీ పౌరులను ‘‘గుర్తించడానికి, నిర్బంధించడానికి, బహిష్కరించడానికి’’ అనుమతి స్తుంది, అయితే 1920 పాస్‌పోర్ట్ ‌చట్టంలోని సెక్షన్‌ 5 ‌ప్రకారం , అక్రమ విదేశీయులను బలవంతంగా తొలగించే అధికారం ఉంది. ఇంకా, శరణార్థుల స్థితి, వారి రిజిస్ట్రేషన్‌ను నిర్ణయించే సమయంలో కూడా వారిని అంగీకరించడానికి లేదా తిరస్కరించ డానికి అధికారులకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. చివరగా, 2019 పౌరసత్వ సవరణ చట్టం ఆఫ్ఘనిస్తాన్‌, ‌బాంగ్లాదేశ్‌, ‌పాకిస్తాన్‌లలో హింసించ బడిన హిందూ, సిక్కు, క్రైస్తవ, పార్సీ, జైన, బౌద్ధ ‘వలసదారులను’ మాత్రమే రక్షిస్తుంది. శరణార్థులు, అక్రమ వలసదారులు, పౌరులు కాని వారిని రక్షించడానికి రాజ్యాంగ రక్షణలు, అంతర్జాతీయ చట్ట సూత్రాలను తరచుగా ఉపయోగించే న్యాయ వ్యవస్థకు ఈ చట్టాలు పెద్దగా సహాయపడలేదు.

దేశ పౌరులను కాపాడుకోవడం భారత ప్రభుత్వ ప్రాథమిక విధి. పౌరుల రక్షణకు విఘాతం కలించే ఏ విధానమైనా అహేతుకమైనదే! కాబట్టి పౌర భద్రతకు తొలి ప్రాధాన్యమిచ్చి- పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోకముందే రొహింగ్యాలను ప్రభుత్వం వెనక్కి తిప్పి పంపాలి.

-క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్