
ఆలయాలకు చెందిన డబ్బును ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంకులను రక్షించేందుకు ఉపయోగించొద్దంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ సొమ్ము పూర్తిగా దేవుడికి చెందినదని తేల్చి చెప్పింది. ఆ నిధులను ఆలయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
సహకార బ్యాంకులకు ఆదాయ వనరుగా లేదా అవి మనుగడ సాగించేందుకు ఆలయ నిధులు ఉపయోగించొద్దని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేరళలోని తిరునెల్లి దేవస్థానం చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని కేరళ హైకోర్టు గతంలో ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ మనాంతవాడి కో-ఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్, తిరునెల్లి సర్వీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సహా కొన్ని సహకార బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌ను విచారిస్తూ న్యాయస్థానం పైవ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా.. ‘‘మీరు ఆలయ డబ్బును ఉపయోగించి బ్యాంకును రక్షించాలనుకుంటున్నారా? కష్టాల్లో ఉన్న ఒక సహకార బ్యాంకులో డబ్బు ఉంచే బదులు, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు ఆ నిధులను మార్చాలని ఆదేశించడంలో తప్పేముంది?’’ అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘మీరు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలి. కస్టమర్లను, డిపాజిట్లను ఆకర్షించలేకపోతే అది మీ సమస్య’’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
దేవుడి డబ్బును తిరిగి చెల్లించడానికి సమయం పొడిగించాలని కోరుతూ మాత్రమే కో-ఆపరేటివ్ బ్యాంకులు హైకోర్టును ఆశ్రయించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ బ్యాంకుల పిటిషన్లను విచారించడానికి మాత్రం నిరాకరించింది. తిరునెల్లి దేవస్థానం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన ఐదు సహకార బ్యాంకులు గడువు ముగిసినా, తిరిగి చెల్లించాలని పదేపదే అడిగినా.. డబ్బు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో దేవస్థానం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ తర్వాత రెండు నెలల్లోగా దేవస్థానం డిపాజిట్ మొత్తాన్ని తిరిగివ్వాలని బ్యాంకులను హైకోర్టు ఆదేశించింది.





