News

భగవద్గీత మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి

141views

సనాతన ధర్మం ఎప్పటికీ మూఢనమ్మకానికి ప్రతీక కాదు, అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇతరులు మన ధర్మం మీద దాడులు చేస్తున్నారు అని అనడం కంటే ముందు మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ఇతరులు మనపై దాడి చేయకుండా గళమెత్తాలన్నారు. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతీ హిందువులో చైతన్యం రావాలన్నారు.

ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని దర్శించారు. కనక కిండి ద్వారా శ్రీ కృష్ణ భగవానుడిని దర్స్మిచుకున్నారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం అందుకున్నారు. ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారు పవన్ కళ్యాణ్ కి ‘అభినవ శ్రీకృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం చేశారు.

ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ “భారత రాజ్యాంగ లిఖిత ప్రతిలో ఆదేశిక సూత్రాలు ఉన్న పేజీపై శ్రీకృష్ణుడు అర్జునునికి గీతను ఉపదేశిస్తున్న దృశ్యాన్ని చిత్రించారు. ఇది చిత్రం అలంకరణ కోసమో, యాదృచ్ఛికంగానో వేయలేదు. సామాజిక న్యాయం, బాధ్యత, సమానత్వం, సంక్షేమం, ధర్మపాలన – ఇవన్నీ రాజ్యాంగం తెలిపే విలువలు అని బోధించేందుకే గీతాసారం ఉపదేశించే చిత్రాన్ని అక్కడ ఉంచారు. ధర్మం – నైతిక దిక్సూచి, రాజ్యాంగం – న్యాయ దిక్సూచి. రెండింటి లక్ష్యం ఒకటే – న్యాయం, శాంతి, కరుణతో కూడిన సమాజమే.
కొన్నిసార్లు సనాతన ధర్మాన్ని తప్పుగా చూపుతారు, అవమానిస్తారు. ఇలాంటి సమయంలో మౌనం సరైన మార్గం కాదు. ఈ ధర్మ వాతావరణంలో ఎన్నో దేశాల నుండి వచ్చిన ఆలోచనపరులు, భక్తులు కలిసినప్పుడు – అది “వసుధైక కుటుంబం” అనే భారత ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ పుట్టిగె మఠం చేస్తోంది అనేది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు – సంస్కృతిక, నాగరికత బాధ్యత. ‘ధర్మో రక్షతి రక్షితః’– మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఒక కోటి మంది కలిసి భగవద్గీతను స్వహస్తాలతో రాయడం అనే చారిత్రాత్మక కార్యాన్ని సాధించడం పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దూరదృష్టి, తపస్సు, ధర్మభక్తికి నిదర్శనం. లక్షకంఠ గీతా పారాయణం – లక్షమంది ఏకస్వరంగా గానం చేసిన ఈ శక్తి – ఇది భారతదేశ రక్షణ కవచంగా నిలుస్తుంది.

అందరం ప్రతి రోజూ చిన్న కురక్షేత్రమే చేస్తాం
భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. భగవద్గీత… మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి. యువతకు – ముఖ్యంగా జెన్ జి., మిలియనీయల్స్ కు చెప్పే ఒక మాట.. భగవద్గీతను పెద్దవాళ్ళు చదివాక ఎర్రబట్టలో కట్టి, పూజగదిలో ఉంచే గ్రంథంగా చూడకండి. మీరూ దాన్ని చదవండి. మనసు కుంగితే – అది మీకు చక్కటి సలహా ఇచ్చే కౌన్సిలర్. ఆలోచనలు, మనసు అయోమయంలోకి నెత్తివేయబడితే – అది మీ మెంటర్. మీకు నిర్దేశనం చేసే ఒక దిక్సూచి.
ప్రతి రోజూ మనందరం విధి నిర్వహణలోనో, నిత్య జీవనంలోనో చిన్న కురుక్షేత్రాలను ఎదుర్కొంటున్నాము. నైతిక నిర్ణయాలు, ధైర్యపరీక్షలు, సత్యం–అసత్యం మధ్య ఎంపికలు… ఇవన్నీ మనల్ని పరిపరి విధాల ఆలోచనల్లోకి, గందరగోళంలోకి నెట్టేస్తాయి. అలాంటప్పుడు భగవద్గీత ఒక నిర్దేశనం చేస్తుంది.

• కురుక్షేత్రంలో అర్జునిడిలా..
గీత నాకు నిష్కామ కర్మ నేర్పింది. నేను మంత్రిగా నా కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తాను, ఓట్లు వస్తాయా రావా అనేది రెండో విషయం. సత్యం పక్షాన నిలబడాలి, ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా సరే అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కురుక్షేత్రంలో అర్జునుని తరహాలో నాలోనూ అనేక సంశయాలు నెలకొన్న సమయంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం భగవద్గీత స్మరించుకుని, 21 సీట్లకు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే వ్యక్తిగత లాభం కంటే రాష్ట్ర ప్రయోజనం ప్రధానం అని భావించాను. ఇదే ధర్మ–కర్తవ్య సంబంధం. నేను ఈరోజు ఇక్కడికి ఉప ముఖ్యమంత్రిగా కాదు, ధర్మాన్వేషిగా ఈ సభకు వచ్చాను. నాయకత్వం అంటే ప్రతి ఒక్క చర్యనూ నీతికి, సేవకు, బాధ్యతకు అనుసంధానం చేయడమే. భగవద్గీత ఒక ప్రాంతానికో, మతానికో పరిమితమైన గ్రంథం కాదు. ఐన్‌స్టైన్, థోరో, ఓపెన్ హైమర్ మొదలైన ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు గీత ద్వారా ప్రభావితమయ్యారు.

• ఉడుపికి వస్తే అధ్యాత్మిక అనుభూతి
ఉడుపి క్షేత్రంలోనికి అడుగుపెట్టగానే ఒక అనిర్వచనీయమైన అధ్యాత్మిక అనుభూతి కలిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు ఆర్పిస్తున్నాను. ఇది ఆలయ పట్టణం మాత్రమే కాదు – ఇది భారతదేశానికి ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. పుట్టిగె మఠాధిపతి, ఇతర మఠాధిపతులు ఇటీవల గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ‘భారత భాగ్య విధాత’ బిరుదు ప్రదానం చేశారు. ఇది భారత సంస్కృతిని బలోపేతం చేయడంలో శ్రీ మోదీ గారు చేస్తున్న దీర్ఘకాల సేవకు ఇచ్చిన గౌరవం” అన్నారు.