
ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు (85) వయోభారంతో వరంగల్ డాక్టర్స్ కాలనీలోని వారి స్వగృహంలో కన్నుమూశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణ కోసం ఆంధ్ర ప్రాంతం నుండి 65 సంవత్సరాల క్రితం వారు ప్రచారక్‌గా వచ్చారు. మొదట్లో సూర్యాపేటలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రచారక్‌గా విరమించుకుని స్థానిక మహబూబియా హైస్కూల్లో హిందీ పండిట్‌గా పనిచేస్తూ వరంగల్‌లో స్థిరపడ్డారు.
వరంగల్ జిల్లా ఆర్ఎస్ఎస్ కార్యవాహగా, బౌద్ధిక్ ప్రముఖ్‌గా, విభాగ్ కార్యవాహగా, విభాగ్ సంఘచాలక్‌గా, పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహగా, ప్రాంత కార్యకారిణి సభ్యులుగా పనిచేశారు. ప్రతి శనివారం సాయంత్రం పాఠశాల నుండి నేరుగా గ్రామాలకు పర్యటనకు వెళ్లి, అక్కడి శాఖల్లో పాల్గొని తిరిగి సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చేవారు. 1975లో ఇందిర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన వరంగల్ జిల్లాలో అజ్ఞాతంలో ఉండి పలు ఉద్యమాలను నిర్వహించారు. అదేవిధంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో జరిగిన రామ జన్మభూమి ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు.





