News

శబరిమలలో మండల పూజా మహోత్సవం

161views

హరిహర క్షేత్రం శబరిమల ఆలయాన్ని.. ఇతర ఆలయాలకు వలె నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో తెరిచి ఉంచే సంప్రదాయం లేదు. ఈ ఆలయాన్ని ప్రతి నెల మాసపూజ సమయాల్లోనూ, ప్రత్యేక పూజలు, ఉత్సవాల సమయాల్లోనూ తెరుస్తారు. మాసపూజలతో పాటు… విష్ణు పర్వదినం, ఓనం పూజ, మండల పూజ, మకర విళక్కు తదితర ఉత్సవాలు నిర్వహిస్తారు. ‘మకర విళక్కు’ అంటే సంక్రాంతి రోజున శబరిమలలో వెలిగించే మకరజ్యోతి. నవంబరులో 41 రోజుల పాటు మండల పూజలు సాగుతాయి. చివరి రోజు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. మలయాళ పంచాంగాన్ని అనుసరించి ఈ తేదీలు నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం నవంబరు 16వ తేదీన శబరిమలలో మండల పూజా మహోత్సవాలు ప్రారంభమై.. డిసెంబర్‌ 27న ముగుస్తాయని ఆలయ అధికారులు ప్రకటించారు.

అయ్యప్ప స్వామికి ట్రావెన్‌కోర్‌ రాజవంశానికి చెందిన చిత్ర తిరునాళ్‌ బలరామ వర్మ బంగారు ఆభరణాన్ని చేయించారు. మండల పూజ ప్రారంభమయ్యే రోజున స్వామివారికి ఈ ప్రత్యేక ఆభరణాన్ని అలంకరిస్తారు. మండల పూజ వైభవంగా జరుగుతుంది. జనవరి 14న మకర విళక్కు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారం తర్వాత జరిగే పడిపూజతో ఉత్సవాలు ముగుస్తాయి. మకర జ్యోతికి పెద్దపాదం మార్గం తెరుచుకుంటుంది. దీక్ష తీసుకున్న అయ్యప్ప భక్తులు ఎరుమేలి నుంచి పెద్దపాదం మీదుగా వెళ్తారు. దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలను దాటుకుంటూ శబరిగిరికి చేరుకుంటారు. ఆలయ నియమ నిబంధనలను అనుసరించి కార్యక్రమాలను నిర్వహిస్తారు.