
‘భారత సనాతన ధర్మంలో భాగమైన గోమాత బతికితేనే దేశం బాగుంటుందన్న విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని జగద్గురు పిపద్వారాచార్య బలరామ్ దేవాచార్య మహరాజ్ పేర్కొన్నారు. తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటున్నామో.. గోమాతలను సైతం అలాగే చూడాలని సూచించారు. పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 13వ జాతీయ పంచగవ్య వైద్య మహాసమ్మేళనానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘గోవు మన జీవన విధానమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పంచగవ్య విద్యాపీఠంలో పీజీ, డాక్టరేట్లు చేస్తున్న వారందరూ గోసంరక్షణకు కృషి చేయాలి. గోమాత సేవతో, తద్వారా లభించే శక్తితో యావత్ భారత జాతికి మేలు జరుగుతుందనే విషయాన్ని చాటిచెప్పాలి. శ్రీకృష్ణ భగవానుడు గోసేవ చేసి ప్రపంచానికి గోవుల ప్రాధాన్యాన్ని తెలియజేశారు’ అని పిపద్వారాచార్య బలరామ్ దేవాచార్య మహరాజ్ వివరించారు.
ఈ సదస్సుకు అఖిల భారత గోసేవ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణగురుస్వామి, జాతీయ సమ్మేళనం సంయుక్త కార్యదర్శి గొంది ఝాన్సీలక్ష్మి, పంచగవ్య విద్యాపీఠం వీసీ కపిల్ కుమార్, గురుకులపతి గవ్యసిద్ధాచార్య నిరంజన్ వర్మ, జాతీయ సాంస్కృతిక యూనివర్సిటీ ప్రొఫెసర్ చక్రవర్తి రాఘవన్, హైదరాబాద్ ప్రకృతి వైద్య నిపుణులు మురళీధరరావు, తదితరులు హాజరయ్యారు.
20 ఏళ్లుగా పరిశోధనలు
గో ఆధారిత పంచగవ్య విజ్ఞానం చాలా మెరుగైంది. మహర్షులు తమ జీవితాలను పణంగా పెట్టి అనుసరించిన వైద్యవిధానాలపై విద్యాపీఠం నిర్వాహకులు సుమారు 20 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. భారతీయ వైద్యవిధానంలో కారణాలు తెలియని అనేక రుగ్మతలకు ఇది మార్గం చూపుతుంది.
-డాక్టర్ వి.కృష్ణవేణి, రాయలసీమ ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమిషనర్, ఏపీ
ప్రత్యేక పాలసీ ప్రకటించాలి
గోసంరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండేలా కేంద్రం ప్రత్యేక పాలసీని ప్రకటించాలి. గోవులను కాపాడేందుకు వివిధ రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి. కానీ, ఈ విషయం గోశాలల నిర్వాహకులకు, అధికారులకు సరిగా తెలియకపోవడం విచారకరం. దేశవ్యాప్తంగా అపహరణకు గురవుతున్న గోవుల అంశంలో విద్యాపీఠం కేంద్రంగా పోరాడుతున్నాం. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించే వారంతా ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వాలి.
-రాజుగుప్తా, విద్యాపీఠం న్యాయ సలహాదారు, మహారాష్ట్ర హైకోర్టు న్యాయవాది





