News

ప్రజలపైకి ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’.. ఉగ్ర డాక్టర్ల కుట్ర..

137views

దేశాన్ని కుదిపేస్తున్న ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రలో అత్యధిక మంది వైద్యులే ఉన్నారు. వీరు సైన్స్‌ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగుచేసి అమాయక ప్రజల ప్రాణాలను తీసేందుకు యత్నించారు. తమకు ఉన్న జ్ఞానంతో ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని వాడేందుకు సిద్ధం చేశారు.

ఏమిటీ ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’..?
దిల్లీలో ఎర్రకోట వద్ద ఐ20 కారును పేల్చేందుకు బాంబర్‌ డాక్టర్‌ ఉమర్‌ నబీ అత్యంత ప్రమాదకర కెమికల్‌ను వాడినట్లు ఫోరెన్సిక్‌ బృందాలు గుర్తించాయి. మీడియా, భద్రతా వర్గాలు ‘మదర్‌ ఆఫ్‌ సైతాన్‌’గా పిలిచే ట్రైఅసిటోన్‌ ట్రైపెరాక్సైడ్‌ (TATP) ఆనవాళ్లు ఫోరెన్సిక్‌ పరీక్షల్లో బయటపడ్డాయి. ఇది పూర్తిగా అస్థిర రసాయన సమ్మేళనమని నిపుణులు చెబుతున్నారు. దీనిని సాధారణ బాంబులా గుర్తించడం సాధ్యంకాదు. ఉగ్ర డాక్టర్ల బృందం టీఏటీపీని అమ్మోనియం నైట్రైట్‌తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా.. ఫరీదాబాద్‌లో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఐ20 కారులో ఈ మిశ్రమం కారణంగానే భారీ పేలుడు జరిగినట్లు రిపోర్టు అభిప్రాయపడింది. జమ్ముకశ్మీర్‌లో నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇదే రసాయన సమ్మేళనం నుంచి నమూనాలు సేకరిస్తుండగా భారీ పేలుడు జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అంతా డాక్టర్లే..
ఈ ముఠాలో డాక్టర్‌ ఉమర్‌ నబీ (ఆత్మాహుతి బాంబర్‌), డాక్టర్‌ ముజమ్మిల్‌ షేక్‌, డాక్టర్‌ ఆదిల్‌ అహ్మద్‌, డాక్టర్‌ షాహిన్‌ షహిద్‌ కీలక పాత్ర పోషించారు. వీరు కాకుండా డాక్టర్‌ పర్వేజ్‌ సయ్యద్‌ అన్సారీ, డాక్టర్‌ ముజఫర్‌ అహ్మద్‌, డాక్టర్‌ మొహియుద్దీన్‌ సయ్యద్‌ అనుమానితుల జాబితాలో ఉన్నారు. దీంతోపాటు అల్‌ ఫలాహ్‌ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నిసార్‌ ఉల్‌ హసన్‌ కనిపించకుండా పోయారు. గతంలో ఉగ్రకార్యకలాపాలు చేస్తున్నాడని ఇతడిని జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాల మేరకు ఉద్యోగం నుంచి తొలగించారు. దిల్లీలో ఆత్మాహుతి బాంబర్‌ డాక్టర్‌ ఉమర్‌ నబీ అక్రమ మార్గాల్లో రూ.20 లక్షలు సమీకరించినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి.

ప్రజలను రక్షించేందుకు మరో వైద్యుడు..!
ఈ కుట్రకేసు దర్యాప్తులో మరో వైద్యుడు ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. ఆయన పేరు డాక్టర్‌ సందీప్‌ చక్రవరి. ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన శ్రీనగర్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 18-19 అర్ధరాత్రి శ్రీనగర్‌లో జైషేకు మద్దతుగా.. పోలీసులను హెచ్చరిస్తూ.. ప్రజలను భయపెట్టేలా కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఇవి ఎస్పీ దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి నిఘా పెట్టారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా ఆరిఫ్‌ నిసార్‌ దార్‌, యాసిర్‌ ఉల్‌ అష్రాఫ్‌, మక్సూద్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొన్నారు. వీరు తమకు పోస్టర్లు షోపియాన్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్‌ ఇచ్చినట్లు చెప్పారు. అతడిని తమదైన శైలిలో ప్రశ్నించగా.. అల్‌ ఫలాహ్‌లోని ఉగ్ర డాక్టర్ల నెట్‌వర్క్‌ను బయటపెట్టాడు. సదరు మౌల్వీనే ఉమర్‌, ముజమ్మిల్‌, ముజఫర్‌కు ఉగ్రవాదం నూరిపోసినట్లు తేలింది. దీంతో సందీప్‌ బృందం ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు.. డాక్టర్లను అదుపులోకి తీసుకొంది.

ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ సందీప్‌ చక్రవర్తిది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా స్వస్థలం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి విశ్రాంత వైద్యుడు డాక్టర్‌ జీవీ రామగోపాల్‌రావు, పీసీరంగమ్మ (విశ్రాంత డీఎంహెచ్‌వో) దంపతుల కుమారుడు జీవీ సందీప్‌చక్రవర్తి విద్యాభ్యాసం కర్నూలులోనే సాగింది. కర్నూలు వైద్య కళాశాలలో వైద్యవిద్య పూర్తి చేశారు. 2014లో సివిల్స్‌ రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. సాహసోపేతమైన సేవలందించి ఐదుసార్లు రాష్ట్రపతి పతకాలు, నాలుగుసార్లు జమ్ముకశ్మీర్‌ రాష్ట్రస్థాయి పోలీసు పతకాలు, ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ పురస్కారం, నార్త్‌ ఆర్మీ దళాధిపతి పురస్కారం, జమ్ముకశ్మీర్‌ డీజీపీ పురస్కారం, ఏడుసార్లు సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ డీజీపీ పురస్కారాలు అందుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి నిందితులపై చేపట్టిన ఆపరేషన్‌ మహదేవ్‌లో కూడా సందీప్‌ ముఖ్యపాత్ర పోషించారు.