News

ఢిల్లీ బాంబు పేలుడుపై వివాదాస్పద పోస్ట్ : నజ్రుల్ ఇస్లాం అరెస్ట్

151views

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుపై వివాదాస్పద పోస్ట్ చేసినందుకు రిటైర్డ్ స్కూల్ టీచర్ నజ్రుల్ ఇస్లాంను అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సమర్థించే లేదా దానిపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసే ఎవ్వరిపైనైనా చర్యలు తీసుకుంటామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు.హైలాకండి జిల్లాలోని బాస్కండి హయ్యర్ సెకండరీ స్కూల్ లో నజ్రుల్ ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. ఢిల్లీ పేలుడుకు మంద్దుతగా ద్వేషపూరిత సందేశాలను ఆయన పోస్ట్ చేశారు. అంతేకాకుండా దీనిని బిహార్ ఎన్నికల ఫలితాలతో ముడిపెడుతూ కూడా వ్యాఖ్యలు చేశారు.

దీంతో అసోం క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన చేసిన పోస్టును ధ్రువీకరిస్తూ క్రైమ్ ఏఎస్పీ రజత్ కుమార్ పాల్ మాట్లాడుతూ నజ్రుల్ ఇస్లాం ఢిల్లీ పేలుడుకి రాజకీయ కోణం ఇచ్చారని, వివాదాస్పదంగా పోస్ట్ చేశారని తెలిపారు. “నిన్న ఢిల్లీలో చాలా పెద్ద పేలుడు జరిగింది, దీనిపై వివిధ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇది జాతీయ వార్త. కొంతమంది ఈ వార్తను దుర్వినియోగం చేయడానికి మరియు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, దీని కారణంగా వివిధ వర్గాల మధ్య విభజనలు రావొచ్చు. మతపరమైన సంఘటనలు పెరిగే అవకాశాలకు దారితీస్తుంది” అని ఆయన అన్నారు.

ఇక.. దీనిపై ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని సమర్థించే వారికి, వాటికి అనుగుణంగా పోస్టులు చేసే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. ఇలాంటి ద్వేషపూరిత పోస్టుల కోసం పోలీసులు సోషల్ మీడియాను పరిశీలిస్తున్నారని అన్నారు.అలాంటి వ్యక్తులను అరెస్టు చేయాలని నేను డిజిపిని ఆదేశించాను. పహల్గామ్ దాడి తర్వాత అమాయక పౌరులపై జరిగిన దారుణమైన దాడికి మద్దతు ఇచ్చినందుకు 100 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఇప్పుడు కూడా ఢిల్లీ ఉగ్రదాడికి కొంత మంది మద్దతు ఇస్తున్నట్లు తేలింది. ఒక వర్గం ప్రజలు ఢిల్లీ పేలుడుకు మద్దతు ఇస్తున్నారు లేదా సంతోషకరమైన ఎమోజీలతో జరుపుకుంటున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ వ్యక్తులు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు. మేము వారి నేపథ్యాన్ని ధృవీకరిస్తున్నాం, త్వరలో వారిని అరెస్టు చేస్తాం” అని ముఖ్యమంత్రి శర్మ అన్నారు.అస్సాంలో ఉగ్రవాదం పెరగడానికి అనుమతించబోమని, తీవ్రవాద ఇస్లామిక్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు.