News

మాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అడ్డుకున్న మిషనరీ స్కూలు

181views

మాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని గేటు బయటే సెక్యూరిటీ గార్డు అడ్డుకుని లోపలకు పంపని ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వీడియో వైరల్‌ కావడంతో దీనిపై వివాదం తలెత్తింది.

గరివిడి మండల కేంద్రంలోని గోదావరి దేవి సరాఫ్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న కె.ఢిల్లీశ్వరరావు మాలధారణతో పాఠశాలకు వెళ్లగా సెక్యూరిటీ గార్డు గేటు బయటే నిలిపివేశారు. స్థానికులు ప్రశ్నించగా.. మాలధారణతో వస్తే పంపించవద్దని ప్రిన్సిపల్‌ చెప్పారని తెలిపారు.

సమాచారం అందుకున్న విశ్వహిందూ పరిషత్తు సభ్యులు పాఠశాల వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యం అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది. సెక్యూరిటీ గార్డులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అలా ఎందుకు చెప్పారో తెలీదని ప్రిన్సిపల్‌ బి.రవి అన్నారు. విద్యార్థులు మాల ధరించి వస్తే అనుమతించాలనే ఉత్తర్వులున్నాయని, అనుమతించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గరివిడి ఎంఈవో పి.రామారావు హెచ్చరించారు.