
ఛత్తీస్‌గఢ్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కానుక అందుకోబోతోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో రాష్ట్రం నుంచి అమరుడైన తొలి యోధుడిగా చరిత్రకెక్కిన వీర్ నారాయణ్ సింగ్ స్మారకంగా రాయ్‌పుర్‌లో నిర్మించిన భారత తొలి పూర్తిస్థాయి డిజిటల్ ట్రైబల్ మ్యూజియంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన వర్చువల్ రియాలిటీ, వీఎఫ్‌ఎక్స్, కృత్రిమమేధ (ఏఐ)ల సమ్మిళితంగా గిరిజన వీరుల జీవితాలు, పోరాటాలు, సంప్రదాయాలను ఈ సంగ్రహాలయం ఆవిష్కరించనుంది. ఆంగ్లేయులపై ఛత్తీస్‌గఢ్‌లో ఉద్భవించిన గిరిజనుల తిరుగుబాట్లను ప్రతిబింబించేలా 16 గ్యాలరీలను ఇందులో ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్ కళాకారులు వీటిని తీర్చిదిద్దారు. మ్యూజియంలో ఏర్పాటుచేసిన ఏఐ కెమెరాల సాయంతో సందర్శకులు తమను తాము అడవులు లేదా గ్రామీణ నేపథ్యంతో గిరిజన దుస్తుల్లో చూసుకోవచ్చు. 9.75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మ్యూజియంలో గిరిజనుల జెండా సత్యాగ్రహం, జంగిల్ సత్యాగ్రహం వంటివి కళ్లకు కట్టే 650 శిల్పాలు ఉన్నాయి. గిరిజనుల సంప్రదాయ ఆయుధాలు, పనిముట్లు కూడా చూడవచ్చు.





