ArticlesNews

భక్తి సంప్రదాయ సమరసత సాధకుడు సంత్ నామ్‌దేవ్

190views

( నవంబర్ ౦2 – సంత్ నామ్‌దేవ్ జయంతి )

సంత్ నామ్‌దేవ్ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో, ముఖ్యంగా భక్తి సంప్రదాయంలో ప్రధాన వ్యక్తులలో ఒకరు. అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేశారు. ధర్మ నిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలక భూమికను పోషించారు. తాను రచించిన అభంగాల్లో విఠలేశ్వరుని కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించేందుకు, భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు అజన్మాంతం పాటుపడ్డారు.

సంత్ నామ్‌దేవ్ ఆయన మహారాష్ట్రలోని నర్సిబామ్ని జిల్లా పర్భాని గ్రామంలో కార్తీక శుక్ల పక్ష ఏకాదశి విక్రమ సంవత్ 1327న ఓ దర్జీ ఇంట జన్మించారు. ఆయన తండ్రి పేరు డంషెట్, తల్లి పేరు గోనాబాయి. వీరు విఠోబా భక్తులు. నామ్‌దేవ్ తల్లిదండ్రులు నివసించే దక్కన్ ప్రావిన్స్ ఆ సమయంలో ముస్లిం పాలనలో ఉంది. ముస్లిం అధికారులు నిరంకుశులుగా ప్రవర్తించారు. ఇతర మతాల వారిని వేధించేవారు. హిందువులు తమలో తాము విడిపోవడంతో దుష్టులు అధికారాన్ని చలాయించారు. అలాంటి కాలంలోనే నామ్‌దేవ్‌ జన్మించారు. నామ్‌దేవ్ గోవింద శెటి సదావర్తే కుమార్తె రాజాబాయిని వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె.

పాండురంగడి పట్ల నామ్‌దేవ్ భక్తి అపరిమితమైనది. ఎంతగా అంటే శ్రీ కృష్ణ భగవానుడికి స్నేహితుడు, సలహాదారు అయిన ఉద్ధవుని పునర్జన్మ అని చాలా మంది ఇతర భక్తులు గట్టిగా విశ్వసించారు. జాతీయత, లౌకికవాదం వంటి అంశాలను నామ్‌దేవ్ తన భక్తి మార్గాన్ని అనుసంధానించి సామరస్యానికి ప్రాతినిధ్యం వహించారు. సామూహిక భజనగానం వంటి కార్యక్రమాలతో నామ్‌దేవ్ విభిన్న తరగతులవారిని, కులాలవారిని ఆకర్షించారు. ఆరాధన సమయంలో ఆయన సహచరులుగా బ్రాహ్మణులతో పాటు మంగలి, తోటమాలి, కుమ్మరి, స్వర్ణకారులు, అంటరానివారు ఉండేవారు. నామ్‌దేవ్‌ను హిందూ ధర్మంలో దాదుపంత్ సంప్రదాయంలో ఐదుగురు గౌరవనీయులైన గురువులలో ఒకరిగా పరిగణిస్తారు.

విఠోబా ముందు కూర్చొని నామ్‌దేవ్ అతనితో మాట్లాడడం, అతనితో ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ, భజన చేస్తూ గంటలకొద్దీ గడిపేవారు. నామ్‌దేవ్‌కు ప్రారంభం, ముగింపు అన్నీ విఠోబానే. నామ్‌దేవ్‌కు ఇరవై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పండర్‌పూర్‌లో గొప్ప సాధుసంత్ జ్ఞానేశ్వరుడిని కలుసుకున్నాడు. ఇతనితోనే కలిసి తీర్థయాత్రలు చేశాడు. అలా పంజాబ్‌లోని గురుద్వారా సాహిబ్ ఉన్న ఘుమన్ గ్రామానికి చేరుకున్నాడు. 17 సంవత్సరాలకు పైగా అక్కడ నివసించాడు. ఘుమన్‌లో ధ్యానం, సంకీర్తన చేసేవాడు. నామ్‌దేవ్ వెలువరించిన భక్తీ గీతాల్లో 61 శ్లోకాలను సిక్కుమార్గంలోని ఐదవ గురువు గురు అర్జన్ దేవ్ జీ గురుగ్రంథ్ సాహిబ్‌లో సంకలనం చేశారు.

ఉత్తరభారతదేశంలో నామ్‌దేవ్‌ను నిర్గుణ భక్తుడిగా పరిగణిస్తే, మరాఠీ సంస్కృతిలో ఆయన్ను సుగుణ భక్తుడిగా పరిగణించారు. సంత్ జ్ఞానేశ్వర్ పునాది వేసిన వార్కరీ శాఖకు చెందిన ప్రముఖ సాధువుగా నామ్‌దేవ్‌ను భక్తులు కీర్తిస్తారు. నామ్‌దేవ్ స్వరపరిచిన కీర్తనలను మహారాష్ట్ర అంతటా భక్తిశ్రద్ధలతో, ప్రేమతో పాడుతున్నారు. విఠల్ నామాన్ని జపిస్తూనే ఆయన తన 80వ ఏట పండర్‌పూర్‌లోని విఠలుడి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ముక్తి పొందారు. అయితే పంజాబ్‌లోని ఘుమాన్‌లో ఆయన ఆత్మ అతని శరీరాన్ని విడిచిపెట్టిందని మరొక అభిప్రాయం ఉంది. ఆయన ముక్తికి సంబంధించి బేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా శీలం మాత్రమే ప్రధానంగా గ్రహించాలి అని వ్యాసభగవానుడు మన సమాజానికి ఇచ్చిన సందేశాన్నే నామ్‌దేవ్ తన జీవితం ద్వారా మనకు అందించారు. ఆయన జీవితం, ఆయన వెలువరించిన అభిప్రాయాలు నిత్యం ప్రవహించే భక్తి అమృతం.