
తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఒకవైపు.. అఫ్గానిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు మరోవైపు పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు టీటీపీ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను హెచ్చరించింది. దమ్ముంటే తమను ఎదుర్కోవాలని సవాలు విసురుతూ వీడియోలు విడుదల చేసింది. తమమీదకు సిపాయిలను పంపించడం మానేసి.. ఉన్నతాధికారులే యుద్ధభూమికి రావాలని వ్యాఖ్యలు చేసింది. అలాగే అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో దాడి జరిపిన దృశ్యాలను విడుదల చేసింది.
ఒక వీడియోలో కనిపించిన కమాండర్ పేరు కాజిమ్ అని పాక్ అధికారులు వెల్లడించారు. ‘దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కో’ అని అందులో మునీర్‌ను హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న పాక్ అధికారులు కాజిమ్ తలపై 10కోట్ల పాకిస్థానీ రూపాయల రివార్డు ప్రకటించారు. అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి ఆ మొత్తం ఇస్తామని వెల్లడించింది. తన భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)ఉగ్రవాదులపై అఫ్గానిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను అఫ్గాన్ ఖండించింది. ఆ అంశమే ఇరుదేశాల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో ఇటీవల పాక్ చేసిన దాడులపై అఫ్గాన్ ప్రతీకార దాడులు చేసింది. కొన్ని రోజుల పాటు జరిగిన ఘర్షణలకు ఖతార్ రాజధాని దోహాలో ముగింపు పడింది. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.





