
195views
కేరళ ప్రాంత మాజీ సంఘచాలక్ పీ.ఈ.బీ. మీనన్ శ్రద్ధాంజలి సభ కేరళలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ మీనన్ సంఘ్ ను ఓ ఉద్యమంగా కాకుండా ఓ ఆధ్యాత్మిక సాధనగా చూశారన్నారు. మనం వ్యక్తులుగా ఎలా వుండాలో, సంఘ్ ను కుటుంబంలా ఎలా చూసుకోవాలో, స్వయంసేవకులు సంఘ్ కార్యాన్ని ఎలా చేయాలో కూడా చేసి చూపించారన్నారు.
ఆయన చూపిన విలువలు మనతోనే ఎప్పటికీ నిలిచి వుంటాయని, వాటిని ఎప్పటికీ నెమరువేసుకోవడానికి, జ్ఞాపకాలుగా చెప్పుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. మీనన్ ఆలస్యంగా సంఘ్ లోకి వచ్చినప్పటికీ, వచ్చినప్పటి నుంచీ సంఘ కార్యంలో పూర్తిగా మునిగిపోయారన్నారు.

కేరళలోని సంఘ్ స్వయంసేవకులకు మీనన్ సార్ స్ఫూర్తిదాయకమని మోహన్ భాగవత్ నొక్కి చెప్పారు. అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు నాయకత్వం వహించారని, అందుకే మీనన్ సర్ ను కేరళీయులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.
కేరళ ప్రాంత సంఘచాలక్ గా పనిచేసిన మీనన్ (88) ఈ నెల తొమ్మిదో తేదీన కన్నుమూశారు. వృత్తిరీత్యా సుప్రసిద్ధ చార్డర్డ్ అకౌంటెంట్. అయితే.. అందరూ ఈయనను మీనన్ సర్ అని పిలుచుకుంటారు. ఈ నెల 9 న అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో కన్నుమూశారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అప్పటి సంఘ ప్రచారక్ మాధవ్ జీ ద్వారా మీనన్ కి సంఘ పరిచయం ఏర్పడింది .ఆ తర్వాత 1978 లో సంఘ శిక్షావర్గలో పాల్గొన్నారు. అదే యేడాదిలో ఆలువా జిల్లా సంఘచాలక్ గా బాధ్యతలు చెప్పారు. ఆ తర్వాత 1987 లో ఎర్నాకులం విభాగ్ సంఘచాలక్ అయ్యారు.1997లో, మీనన్ సర్ సహ ప్రాంత సంఘచాలక్‌గా బాధ్యతలు స్వీకరించి 2003 వరకు కొనసాగారు. ఆ తర్వాత ప్రాంత సంఘచాలక్ గా బాధ్యతలు స్వీకరించి, 2021 వరకూ కొనసాగారు. తదనంతరం ఆరోగ్య కారణాల రీత్యా వైదొలిగారు.





