
భూ బకాసురుల ఆగడాలు అధికమయ్యాయి. చివరకు ఆలయ భూములను స్వాహా చేసేందుకూ వెనుకాడటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి చెందిన ఎకరా భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మవారి ఆలయ సమీపంలో.. పెన్నానది పక్కనే ఉన్న పూలతోటను తొలగించి ప్లాట్లు వేసి విక్రయించేందుకు ఇటీవల సిద్ధమవగా.. అధికారులు అడ్డుకున్నారు. ఆ భూమికే గత నెల 23న బుచ్చి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. గతంలోనూ ఇదే తీరున మూడు సార్లు జరిగిందని సమాచారం. లీజు వ్యవహారంలో తలెత్తిన వివాదంతో.. విషయం ఆర్డీవో కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ తిరిగి రిజిస్ట్రేషన్ జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిరక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డిని వివరణ కోరగా.. విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆలయ భూమిని ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసినా చెల్లదని, ఉన్నతాధికారులు ఎప్పుడైనా రద్దు చేయొచ్చని స్పష్టం చేశారు.




