News

దేశ వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్ ధర్మ రక్షా అభియాన్

135views

హిందూ సమాజం ఆధ్యాత్మికతను, సాంస్కృతికతను కాపాడడానికి విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘‘ధర్మ రక్షా అభియాన్’’ పేరుతో దేశ వ్యాప్తంగా ఓ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 5 వరకూ జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 10 లక్షల హిందూ కుటుంబాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వారణాసి ప్రాంతంలో జరిగే ఈ అభియాన్ లో అక్రమ మత మార్పిళ్లు, లవ్ జిహాద్, గోవధతో పాటు దేవాలయ భూముల ఆక్రమణల వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం కింద 2 వేల కి పైగా గ్రామాలు, పట్టణాల్లో ప్రతి హిందూ కుటుంబానికి చేరి, అవగాహన కల్పిస్తారు. అలాగే హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా హిందువులందరూ ఐక్యంగా వుండాలని కూడా విజ్ఞప్తి చేస్తారు.

వారణాసి విశ్వహిందూ పరిషత్ బాధ్యులు నితిన్ మాట్లాడుతూ హిందువుల్లో సంఘటనా శక్తిని పెంచడానికి, సమష్టి భావనను నింపడానికి దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘‘మా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ప్రతి హిందూ కుటుంబాన్ని చేరుకుంటారు. హిందూ ఉనికికి వున్న ముప్పును, సమస్యలను చర్చిస్తారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి చేపట్టాల్సిన పనులను కూడా వివరిస్తాం. అందుకే హిందూ కుటుంబం స్వచ్ఛందంగా సహకరించాలని కోరుతున్నాం’’ అని తెలిపారు.

అలాగే ఈ ప్రచారంలో భాగంగా స్వావలంబన, పారదర్శకతను ప్రోత్సహించాలని కూడా VHP లక్ష్యంగా పెట్టుకుంది. హిందూ వ్యతిరేక శక్తులు విదేశీ సంస్థల ప్రోత్సాహంతో హిందువుల్లో ఎలా విభజన బీజాలు నాటుతాయో కూడా వివరిస్తారు. అలాగే సంస్కృతిని కాపాడటం, దేవాలయాల సంరక్షణ, స్వదేశీని ప్రోత్సహించడంపై కూడా హిందువుల్లో చైతన్యం తీసుకురానున్నారు.