
పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశానికి విజయం ఒక అలవాటుగా మారిందని నిరూపణ అయిందని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లో కలిసి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
భారతదేశ శక్తికి బ్రహ్మోస్ ఒక చిహ్నం అని రాజ్‌నాథ్ అభివర్ణించారు. ‘‘బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదు, ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక విశ్వాసానికి రుజువు. సైన్యం నుండి నావికాదళం,వైమానిక దళం వరకు, ఇది మన రక్షణ దళాలకు కీలక స్తంభంగా మారింది’’ అని ఆయన అన్నారు. ‘‘పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏమి జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమే. భారతదేశం పాకిస్తాన్‌ను సృష్టించగలిగితే, సమయం వస్తే.. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీరంతా తెలివైనవారు’’ అని అవసరమైతే పాకిస్తాన్‌ను ముక్కలు చేస్తామని పరోక్షంగా రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ భారతీయులకు కొత్త విశ్వాసాన్ని కలిగించిందని, ప్రపంచానికి బ్రహ్మోస్ ప్రభావాన్ని చూపించిందని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నాశనం చేయడానికి భారతదేశం ఉపయోగించింది. పాక్ రాడార్లకు చిక్కకుండా అత్యంత ఖచ్చితత్వంతో బ్రహ్మోస్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నాశనం చేసింది.