
కలియుగ ప్రత్యక్ష దైవమైమన తిరుమల ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న మాదిరిగానే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. 2020 కంటే ముందు తిరుమలలో కేవలం రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేవారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారికి భక్తుల దర్శనాలు అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
ఆగమ శాస్త్రం ప్రకారం.. ఏకాదశి, ద్వాదశిల్లో కేవలం 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరచి ఉంచాలని సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు. శాస్త్రాలకు విరుద్ధంగా వెళ్లి.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరవకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను శ్రీనివాసానంద సరస్వతి కోరారు. ఈ మేరకు టీటీడీ ఈవోను కలిసి.. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. వినతిపత్రం సమర్పించారు.
వైకుంఠ ద్వారాలను 10 రోజులపాటు తెరవడం అనేది గత ప్రభుత్వం ప్రారంభించిందని.. డబ్బుల కాసుల కోసమే ఇలా చేశారని ఆయన ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానానికి స్వస్తి పలికి.. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సామాన్యులకు స్వామి వారి దర్శనాలు కల్పించాలని కోరారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. టీటీడీ పెద్దలతోపాటు.. ఈవో, ఛైర్మన్, ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆచారాలు, సాంప్రదాయాలను గౌరవించాలని శ్రీనివాసానంద సరస్వతి సూచించారు. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంచడంతో చాలా మంది భక్తులు దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని.. అయితే ఇది విరుద్ధమని తెలిపారు. దీన్ని భక్తులు కూడా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే పూర్వం తిరుమలలో ఉండేదని గుర్తుచేశారు.
ఈ విషయం వేద పండితులకు, ఆగమశాస్త్ర పండితులకు తెలియదా అంటూ శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. అప్పట్లో ఎందుకు రెండు రోజులు మాత్రమే కొనసాగించారని నిలదీశారు. ఎవరైనా వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే.. ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే దర్శించుకోవాలని తేల్చి చెప్పారు. వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు ఉండదని స్పష్టం చేశారు.




